“అమ్మా... నా పారాచూట్ ఏదీ? ఇక్కడే పెట్టాను లేదు!” రూఫ్ ఎగిరి పోయేలా అరుస్తూ వాళ్ళ అమ్మని పిలుస్తున్నాడు చింటూగాడు.
చేతిలో పని వదిలేసి కిచెన్ లోంచి పరిగెత్తుకొచ్చింది సుమ.
“నిన్న ఆడుకుని ఈ టీపాయ్ మీదే పెట్టా ఎవరు తీసారు?” రెండు చేతులు నడుం మీదుంచుకుని చిరాకుగా చూస్తూ కోపంగా అరుస్తున్నాడు ఏడేళ్ళ చింటూ.
“అయ్యో సోఫాకిందేమైనా పడిపోయిందేమో...” చెప్తూ కిందకి వంగి సోఫా కిందా, టీపాయ్ కిందా వెతకసాగింది సుమ. అక్కడేమీ కనిపించక పోవటంతో అన్ని గదుల్లోనూ వెతికి వేసారి మళ్ళీ రెండోసారి అన్నింటి క్రిందా వెతకటం మొదలెట్టింది.
డైనింగ్ టేబుల్ కిందదూరి వెతుకుతున్న సుమ కి హఠాత్తుగా ‘అసలీ పారాచూట్ ఏమిటీ? ఎక్కడిది?’ అన్న బల్బు వెలిగింది.
“ఏంట్రా అది? ఎలా ఉంటుంది?” అడిగింది అక్కడే చతికిలబడి.
“అదే పారాచూట్ తెల్లగా ఉంటది... నిన్న నేను ఆడుకున్నా చూడు... అదే!” రాగం ఆపకుండా బదులిచ్చాడు.
వాడి గొంతు పీచ్ రేంజ్ ఎప్పుడూ ఒకేలా ఎలా మెయింటైన్ చేస్తాడో సుమ కెప్పుడూ అర్ధమైచావదు.
దేంతో ఆడుకున్నాడు! గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నం మొదలెట్టింది. “ఎక్కడిది అది నీకు?”
“నాదే! గాల్లోకి ఎగరేస్తే ఎగురుతూ కిందకు దిగుతుందే అదే పారాచూట్.” అన్నాడు అసలు నీకేం తెలుసు కనుక ఇది తెలియటానికి అనట్టు అదోలా చూస్తూ గొంతు తగ్గించకుండా.
“డాడీ కొనిచ్చాడా?” ప్రశ్నిస్తూ అలమార తెరచి వాడి దౌర్జన్యానికి బలైన బొమ్మల శిథిలాల మధ్య వెతకటం మొదలెట్టింది.
“ఉహూ నాదే!” రౌద్రంగా అరిచాడు. ఇల్లంతా వెతికి వెతికి ఆ తెల్లటి ఎగిరే పారాచూట్ కనిపెట్టలేక వచ్చి సోఫాలో చతికిల బడింది.
“నిన్న కొన్న ఆ రైలు బొమ్మతో ఆడుకో రాదురా ప్లీజ్…” కింద విరిగి పడున్న బొమ్మ రైలు బోగీలనీ, ట్రాక్స్ నీ చూస్తూ మొరపెట్టుకుంది వాడితో.
“ఉహూ దానికి యాక్సిడెంట్ అయ్యింది. నాకిప్పుడు నా పారాచూట్ కావాలంతే!” ఖచ్చితమైన గొంతుతో ప్రకటించేసాడు.
అప్పుడే ఇంట్లోకి వస్తున్న భర్త ని చూడగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినటైయ్యింది ఆమెకి.
“ఏంటీ, ఎందుకేడుస్తున్నాడు?” అడుగుతూ వాడిని లేపి ఎత్తుకున్నాడు వంశి.
“వాడి బొమ్మేదో కనిపించలేదట, ఇల్లంతా వెతికి చూసా దొరకలేదు బయట పారేసుకున్నాడేమో.” ఆయాసంగా చెమటలు తుడుచుకుంది.
“ఏరా, ఏంబొమ్మరా?” అడిగాడు తన చేతిలోని పూలు ఉన్న కవర్ ని టీపాయ్ మీద పెడుతూ.
“పారాచూట్ బొమ్మ. అది మీరు కొనిచ్చారా?” అడిగింది సుమ.
“నేనేం కొనలేదే, ఏరా ఎక్కడిదిరా అది, ఎలాగుటుంది చెప్పు మనం వెతికేద్దాం ఓకేనా” వాడిని ఉత్సాహపరుస్తూ ప్రశ్నించాడు.
“అదిగో అలాగే ఉంటది. అదే పారాచూట్.” టీపాయ్ పై వంశి తెచ్చిన పూలు ఉన్న చిన్న పాలిథిన్ కవర్ ని చూపిస్తూ చెప్పాడు చింటు.
ఒక్కక్షణం వెర్రిగా చూసింది సుమ. అప్పటికే మొత్తం అర్ధమైపోయింది. కెవ్వుమని అరవాలనే కోరిక బలవంతంగా ఆపుకుంటూ “హు నేను పిచ్చిదాన్ని అవటానికి ఎంతో టైమ్ లేదు” విసుక్కుంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
‘వెదవ పాలిథ్న్ కవర్ తో ఆటలాడి దానికో పారాచూట్ అని పేరు పెట్టేసి, దానికోసం కొంపంతా కెలికించేసాడు. చస్తున్నా వీడితో….’ మెల్లిగా హాల్లోకి వినిపించకుండా తిట్టుకోసాగింది.
‘నిన్నటికి నిన్న తెలిసిన వాళ్ళింటికెళితే వాళ్ళపిల్లలకి వీడి వెదవ ఆటలన్నీ నేర్పి, వాళ్ళ షోకేస్ లోని బొమ్మలన్నీ క్యాచ్ ఆట అంటూ ఆడి పడగొట్టేసారు. ఆదివారం అన్నయ్య వాళ్ళింటికి పంపితే అక్కడ కిష్కింద కాండ ప్రదర్శించి వచ్చాడు! వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ దీవాన్ బల్లని లేపి దుప్పట్లతో కిటికీకి కట్టేసి అదేంటో ఆట అని చెప్పి వచ్చాడంట! వాళ్ళు రోజూ ఆ ఆట ఆడి దెబ్బలు తగిలించుకుంటున్నారు అంటూ వదిన లబో దిబో అంటోంది.
పైగా నోరు విప్పితే ఏంతపెద్ద మాటలో, ఎక్కడ ఎవరిముందు ఏం మాట్లాడతాడో నని అనుక్షణం హడలి చస్తూ ఉండాల్సిందే. ఇవ్వన్నీ ఒక ఎత్తు వాడి వేసే ప్రశ్నలు, వాడికి వచ్చే సందేహాలూ ఇంకో ఎత్తు.. వాటికి సమాధానలు చెప్పడమంటే ఆశామాషీ కాదు.’
స్కూల్లో టీచర్స్ వీడి గురించి ప్రతిరొజూ ఏదో ఓ కంప్లైన్ట్ చెపుతూనే ఉంటారు. మొన్న ఇంకో పిల్లడితో వీడి దెబ్బలాటలో పొరపాటున ఆ పిల్లాడి పుస్తకం చిరిగితే వీడి ని గ్రౌండ్ చుట్టు పరిగెత్తమని పనిష్మెంట్ ఇచ్చిందిట టీచర్. అలా పరిగెడుతుంతే సూపర్ గా ఉందని అందరికీ ఊరించి చెప్పాడుట వీడు. అందరూ ఒకరి పుస్తకాలు ఒకరు చించుకుని కూర్చున్నారుట. ఆ టీచర్ ఇచ్చే సూపర్ పనిష్మెంట్ కోసం! ఆమె పిలిచి చెపుతోంటే తలేత్తులేక పోయింది. ఇంకోసారి స్కూల్లో పెద్ద పిల్లలు చిన్న గొడ మీదకి ఎక్కి కిందున్న ఇసకలో దూకే ఆట ఆడుకుంటుంటే వెళ్ళి .. ‘చూస్తూ ముందుకి దూకితే ఏం గొప్ప గోడెక్కి వెనిక్కి దూకాలి’ అన్నాట్ట. దాంతో ఓ పిల్లాడు అలాగే వెనిక్కి విరుచుకుని దూకి చెయ్యి విరగొట్టుకున్నాడు. పిల్లలందరూ వీడిపై చెపుతుంటే తనకి అక్కడే ఏడుపొచ్చేసింది.
అసలు భయం అన్నదే లేదు! ఆటలంటే అంటే చాలు ఒళ్ళు తెలియదు. దెబ్బలు తగిలించుకుని వస్తాడు.
పిల్లలని కొట్టకుండా తిట్టకుండా భయం లేని వాతావరణం లో పెంచాలనే వంశి కోరిక కొంతవరకు సుమకూ సమ్మతమే కానీ చింటూ అత్యుచ్చాహమూ, చిలిపిదనమూ ఆమెని టెన్షన్ లో పడేస్తూ ఉంటాయి.
“డాడీ వీటినిలా తినకూడదు. మొన్న నేను కార్టూన్ నెట్వర్క్ లో చూసాను... అమ్మాయి వళ్ళో పడుకుని ఆమె అందిస్తూ ఉంటే ఆ గుత్తిలోని పండ్లన్నీ నోటితో అందుకుని తిన్నాడు.”
తండ్రి తెచ్చిన ద్రాక్ష పళ్ళు ఎలా తినాలో చెపుతున్న చింటూ మాటలు వినిపించి అయోమయంగా వండుతున్న పప్పులో వేయబోయిన కారం పొడిని ఉడుకుతున్న అన్నంలో వేసేసింది సుమ.
****
హాల్లో టీవీ ముందు కూర్చుని టామ్ అండ్ జెర్రీలో జెర్రిని ఎంకరేజ్ చేస్తూ గావు కేకలు వేస్తున్నాడు చింటూ.
‘వీడు నిద్రపోడు, నాకు ఇంకోళ్ళకి నిద్రపట్టకుండా చేస్తాడు’ మనసులోనే నిట్టూరుస్తు భర్తపక్కనే చేరి రోజూలాగే దీనంగా చెప్పింది . “వంశీ వాడిని కాస్త అదుపులో పెట్టకపోతే రాను రాను మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందేమో ఒక్క సారి ఆలోచించండి”
“సుమా నువ్వే కాస్త కంట్రోల్లో ఉండాలమ్మా, ఆ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చెయ్యి మెడిటేషన్ మానేసినట్టున్నావు!” ఫ్యాన్ వైపు చూస్తూ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు వంశి.
“నా బొంద మెడిటేషన్ ఏ నిమిషాన ఏ వార్త వింటానోనని గుండే అరచేతిన పెట్టుకు తిరుగుతున్నా, ఐనా నేనన్నదేమిటి? మీరు మాట్లాడేదేమిటి?” గయ్యిమంది.
“నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు! పిల్లాడిని ఆ పుస్తకాలలో మేథావులు చెప్పినట్టే పెంచితీరతా”
ఎప్పటిలాగే తన తిరుగులేని నిర్ణయం గురించి ప్రకటించిన అతడి వైపు నిస్సహాయంగా ఓ చూపుచూసి
“ఐతే ఆ పెంపకమేదో మొత్తం మీరే చూసుకొండి. నా వల్లకాదు ఈ రోజు నుండి నేనేది పట్టించుకోను” చెపుతూనే దుప్పటి ముసుగెట్టబోతున్న సుమ హాల్లో నుండి టీవీ పేలిన శబ్దం విని దుప్పటి విసిరేసి అటుకేసి పరిగెత్తింది ఇందాకటి తన శపధం మరచి.
* * * * *
“మొత్తానికి నీది చీకూ చింత లేని సంసారమోయ్. మన ఆఫీసు లో చూడు అందరూ ఏదో జంజాటం తో బాధ పడేవాళ్ళే, అదృష్టవంతుడివి. ఎప్పటికైనా మి వూరు వెళ్ళిపోతాం అంటుటావు. మరిక్కడ ఫ్లాట్ కొనేశావే!” వంశీని పొగిడేస్తున్నాడు వాళ్ళబాస్.
‘హు వీడికి ముడో యేడు రాగానే చిలిపి క్రిష్ణుడని అర్ధం ఐపోయింది... అద్దిళ్ళళ్ళొ ఉండి మాటపోగొట్టుకోలేక....., కొనుక్కోక ఏం చేస్తాం!’ అనుకుని నిట్టూర్చింది సుమ.
అదే అపార్ట్మెంట్ లోని చుట్టాలింటికి వచ్చిన బాస్ లిఫ్ట్ లో కనిపించేసరికి తమ ఇంటికి తీసుకుని వచ్చాడు వంశీ. ఇద్దరూ ఏవో మాటల్లో పడిపోయారు.
వాళ్ళకి టీ పెడదామని వంటింట్లోకి వెళ్ళింది . అంతలోకి చింటూ అక్కడే కూర్చుని ఉన్నాడని గుర్తొచ్చి కంగారుగా వాళ్ళదగ్గరికి పరిగెత్తింది చేతిలో బిస్కెట్ల ప్లేటుతో.
ప్లేటు టీ పాయ్ మీద పెట్టి “తీసుకొండి” అని బాస్ తో చెపుతూ భయంగా చింటూ వైపు చూసింది.
బుద్దిగా వచ్చిన అతిథి నే గమనిస్తున్నాడు చింటూ.
‘దేవుడా ఇప్పుడు అతడి ముందు వీడు ఎలాంటి తింగరి మాటలు మాట్లాడకుండా చూడు’ అని మనసులో మొక్కుకుంటూ “నాన్నా నువ్వు ఇలా రామ్మా, నీకు చాక్లెట్ డ్రింకు ఇస్తా.” బలహీనంగా పిలిచింది.
“అమ్మా ఈ అంకుల్ డర్టీ ఫెలో చెయ్యి కడుక్కోకుండానే బిస్కెట్ తింటున్నాడు” అంటున్న వాడి చెయ్యిపట్టుకుని లాక్కురాసాగింది. “ఉండమ్మా ఈ అంకుల్ కి మేనర్స్ తెలియదు లాగుంది థాంక్స్ చెప్పకుండానే తినేస్తున్నాడు...”
పిల్లల పెంపక నిబంధనలకి నీళ్ళొదిలి వాడి నోరు గట్టిగా నొక్కి గింజుకుంటున్న వాడిని బలవంతంగా లోపలికి లాక్కొచ్చింది సుమ.
* * * * *
“పిల్లలకి నేర్పటం కాదు మీరు చేయాల్సింది, పిల్లలనుండి నేర్చుకోవాలి. వారిపై మీ నిరాశ, నిస్పృహలు చూపకండి. వారిని దండించ వద్దు. భయమంటే ఏమిటో ఎరగకుండా వారు పెరగాలి. బలవంతంగా ఏదీ నేర్పించకండి, మనసులో ఉన్నది మాట్లాడనివ్వండి. వారికి ఇష్టమైనవే చేయనివ్వండి..., మీ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు.” స్టేజ్ పై గురూజీ ఉపన్యాసం సాగుతోంది.
“ఇంటికెళదాం” నీరసంగా లేచి బయటకు నడచింది సుమ.
“అదేమిటోయ్ మొత్తం విని వెళదాం.” అంటూ వెనకే వచ్చాడు వంశి.
“వద్దులే, ఏదో మనశ్శాంతి కోసం వచ్చాను...., ప్చ్.. ఇంకేదైనా వేరే చెప్తారనుకున్నా...వద్దులే..,” సమాధాన మిస్తూ వంశి మాటలు పట్టించుకోకుండా పార్కింగ్ వైపు నడిచింది.
“గుడికెళ్దామా?” అడిగాడు ఆమె మూడ్ మార్చటానికి.
“వద్దులే వాడిని ఆస్కేటింగ్ క్లాసులో వదిలివచ్చాం, ఏం గొడవ తెస్తాడో వెళ్దాం అక్కడే ఉండడం మంచిది.” చెప్పింది కారు లో కూర్చుంటూ. “కనీసం ఇక్కడైనా బుద్దిగా దెబ్బలూ అవీ తగిలించుకోకుండా ఎవరితో దెబ్బలాడకుండా పూర్తిగా నేర్చుకుంటే బావున్ను.” బయటకు చూస్తూ దిగులు పడింది.
“ఏంటి సుమా వాడి గురించిన దిగులు వదిలేయ్, గురుజీ చెప్పంది విన్నావా అసలు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనుషులు ఎంత ధైర్యంగా, చలాకీగా తెలివిగా ఉంటారు గమనించావా, కొందరి పిల్లల చలాకీతనం చూస్తే చూస్తే పెద్దయ్యాక వీళ్ళు ఏమౌతారో అననుకుంటాం.... వాళ్ళే పెద్దయ్యాక చూస్తే సంకుచితంగా, నిస్సహాయంగా, నీరసంగా ఉంటారు. ఎందుకంటావ్! అదంతా పెంపకంలో జరిగిన పొరపాట్ల వల్లనే, ఎన్నో అపోహలు, పిరికితనం, హిపోక్రసీ, అర్ధం లేని కట్టుబాట్లు వీటి మధ్య పెరిగితే అంతే మరి." మెల్లిగా ఆనునయంగా చెప్పాడు.”
“నువ్వుచెప్పేవి నేనూ ఒప్పుకుంటా కానీ చుట్టూ అందరూ ఎలాగుంటే అలా మనమూ ఉండక తప్పదు కదా, నల్గురిలో ఉన్నప్పుడు కొన్ని ఇష్టం లేకపోయినా మనమూ చేయాలి.” ఎప్పటిలాగే ఓపక్క అతని మాటలు ఒప్పుకుంటునే తన నిరసననూ చెప్పింది.
“కొంతకాలం ఓర్చుకుంటే పెద్దయ్యేకొద్ది పిల్లచేష్టలు తగ్గుతాయి, వారి చిలిపిచేష్టలను కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళకి భయం అలవాటు చేయకూడదు. స్వేచ్చగా మాట్లాడే, ఆలోచించే, ప్రశ్నించే వీలు కలిపించినప్పుడే పిల్లలు పూర్తిగా వికసిస్తారు .....”
“ఊ మీ పెంపక ప్రయోగాలు సక్సెస్ ఐతే సరే మంచిదే గానీ వాడు పెంకిగా, గారంగా, రౌడీలా తయారవుతాడేమో ననే నాభయం.” చెప్పింది అదే వాదనకి ముగింపు అన్నట్టు.
“మేడమ్ బాబు చెడ్డమాటలు, తిట్లు మాట్లాడుతున్నాడు.” చెపుతున్న స్కేటింగ్ నేర్పే అబ్బాయిని వైపు నిరాశగా, నిరుత్సాం, దిగులు వగైరా భావాలు పలికే కళ్ళతో చూసి, మౌనంగా బుట్టలో నుండి నీళ్ళ బాటిల్ తీసి తాగింది.
“వాడమ్మ కడుపుమాడ నన్ను ఓవర్ టేక్ చేసేస్తున్నాడు నేనొక్క గుద్దు గుద్దానంటే చచ్చూరుకుంటాడు డొక్కెదవ.” వాళ్ళ డాడీతో కంప్లైంట్ చేస్తున్నాడు చింటూ.
“తప్పునాన్నా అలా తిట్టగూడదు.” చెప్పబోతున్న వంశీతో
“డాడీ మొన్న ట్రాఫిక్ లో రెడ్లైట్ దగ్గర మనకారు ఆపితే రాసుకుంటా ముందుకు పోయిన ఆటోవాడిని నువ్వూ ఇలాగే తిట్టావుగా?” అడిగాడు వాడు.
గుడ్లు ఉరుమి వంశీవైపు చూసి విస విసా కారు వైపు నడచింది సుమ.
“సుమా.. అలా గుడికెళదామా.” సుమను మాట్లాడిస్తూ ఎలాగైనా కూల్ చేయాలన్నట్టుగా అడిగాడు కారు రోడ్డుమీదకు రాగానే.
“వద్దు బాబూ వద్దు! దేవుడు ఏమిటి? ఎందుకు? ఎలా ? ఏంటేంటో ప్రశ్నలేసి చంపుతాడు. వాటికి సమాధానాలు ఇచ్చి వాడిని ఒప్పించేంత తెలివి నాకు లేదుగానీ ఇంటికే వెళ్దాం!”
“పోనీ మీ ఫ్రెండ్ ప్రియ వాళ్ళింటికి వెళదామా.” ఎలాగైనా ఆమెని సంతోషపెట్టాలనే తాపత్రయంతో మళ్ళీ అడిగాడు.
“సరెలె. నా కంత సీన్ లేదు. పోయినసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మీ సుపుత్రుడు అక్కడ మాట్లాడిన మాటలు మర్చిపోయారా! అమ్మా వీళ్ళేంటీ ఇల్లు ఇంత డర్టీ గా పెట్టుకున్నారు. చెత్తగా ఉంది ఇక్కడ నాకేం నచ్చలేదు. అనలేదూ..! ఇల్లంతా చెత్తగా చేస్తే నన్ను డర్టీ బోయ్ అని తిడతావుగా నీ ఫ్రెండ్ ని ఏమీ అనవేం? ఆంటీని చూస్తే సోగ్గా ఉందీ. ఇల్లు చూస్తే డర్తీగా ఉందీ. అంటాడా! హవ్వ. ఓ చిన్నపిల్లాడు మాట్లాడే మాటలా అవి! నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియ చచ్చాను.”
“ఆ.., అవి వాళ్ళు పట్టించుకోరులే నువ్వు మరీ....” ఏదో చెప్పబోతున్న వంశీని ఉరిమి చూసింది.
ఆమె కోపం గ్రహించినట్టు గా వెంటనే కారుని ఇంటివైపుగా మళ్ళించాడు వంశీ.
ఇద్దరి మాటలతో తనకేం సంబంధం లేదనట్టుగా వెనక సీటులో కూర్చుని స్కేటింగ్ షూ ని ఆపరేషన్ చేస్తూ పార్టులుగా ఊడదీయడంలో మునిగిపోయాడు చింటూ సీరియస్ గా.
* * * * * *
“పద్మ నాల్గు రోజులనుండీ పనికి రావటం మానేసింది, పిల్లాడితో ఇంటిపనంతా చేసుకోలేనని తెలుసుగా...రెండ్రోజులకోసం పక్కింటి పనిషిని పిలుచుకుందామంటే ఆవిడా వారం నుండి రావడంలేదట మొక్కులని ఊరు పోయిందట” సణుగుతోంది సుమ.
“ఇంకెవరన్నా ఉంటే పంపించమని వాచ్ మెన్ తో చెప్పి వస్తానుండు.” అప్పటికప్పుడు వాచ్మెన్ దగ్గరకు బయల్దేరాడు వంశీ.
‘చింటూ పుట్టకముందునుండీ పద్మ తన దగ్గరే పనిచేస్తుంది. ఎన్నడూ నాగాలు పెట్టి ఎరగదు, ఏదైనా అవసరం వచ్చినా ముందురోజే చెప్పివెళ్ళి మర్నాటి సాయంత్రానికల్లా వచ్చేస్తుంది, రాలేననుకుంటే తనబదులు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసే వెళుతుంది, ఏదో ముఖ్యకారణమే ఉండి ఉంటుంది లేకపోతే ఇలా చేయదు.’ అనుకుంది సుమ.
“పద్మ భర్త కు యాక్సిడెంట్ అయ్యిందట, వాచ్ మెన్ పద్మ మామ కనిపించి చెప్పాడట.” యాక్సిడెంట్ వార్త ని మోసుకొచ్చిన వంశీ మాటలు విని ఒక్కఉదుటన లేచింది సుమ.
“అయ్యోపాపం, అతను రిక్షా నడుపుతాడు, రిక్షా యాక్సిడెంట్ అయ్యిందేమో. ఎలా ఉన్నాడట ?”
“ఏమో మరి అదేం చెప్పలేదు ఈ రోజు వస్తానని చెప్పమందని చెప్పాడట.”
“వస్తానని చెప్పిందంటే అతనికేం అయ్యుండదులెండి.” పద్మ వస్తానందనగానే ప్రాణం లేచివచ్చింది సుమకి పద్మలేక ఇల్లంతా చిరాగ్గా తయారయ్యింది, పద్మ లేకపోతే ఇల్లెలా అనిపించేంతగా అలవాటైపోయింది. శ్రద్దగా పనిచేస్తుంది, ఇల్లంతా నీట్గా ఉంచుతుంది, చింటు అల్లరి ఆమె మాత్రమే భరించగలదు, చింటూకూ పద్మ అంటే ఇష్టం.
పద్మ వస్తుందనగానే రిలాక్సైపోయి పనిమాట మరచి వంశీ తో కబుర్లలో మునిగిపోయింది సుమ. ఆడుకోవటానికి వెళ్ళిన చింటూ వచ్చాడు. వాడికి పాలు కలుపుతూ ఉంటే వచ్చింది పద్మ.
“ఏంటీ పద్మా.. వాచ్మెన్ ఏదో చెప్పాడు. ఏం జరిగింది?” అడుగుతున్నాడు వంశీ. సుమకూడా వచ్చి ఏంజరిగింది అన్నట్టు చూసింది.
ఇంట్లోకిరాకుండా బయటే నిలుచుంది పద్మ. “సారూ పెద్ద యాక్సిడెంటు అయ్యింది, డాక్టరు ఏం జెప్పలేము అన్నడు, ప్రాణానికి భయం లేదని నిన్న జెప్పారు. ఒక కాలు బొక్క ఇరిగింది కట్టు కట్టిండ్రు, ఇంకోకాలు పూర్తంగ తీసేసిండ్రు, ఒక చెయ్యి బొక్క రెండు దిక్కుల ఇరిగిందంట కట్టుకట్టిండ్రు.” కళ్ళంమ్మట నీళ్ళు పెట్టుకుంటూ చెప్తోంది.
“అయ్యో ... ఎలా జరిగింది?” ప్రశ్నించింది సుమ.
“రిక్షాని ట్రక్కు గుద్దేసి పోయ్యిందంటమ్మా. ప్యాసింజర్లు లేరు ఉంటె ఎన్ని ప్రాణాలు ఉసురు మనేటివో...” ఏడుపు ఆపకుండానే చెప్పుకుపోయింది
“ఇప్పుడు ఎలాఉన్నాడు?” ప్రశ్నించాడు వంశి.
“ప్రాణాలకు భయం లేదన్నరు. చెప్పిపోదామని వచ్చిన.” అని మౌనంగా నిలుచుంది పద్మ.
ఇంట్లోకి వెళ్ళి ఓ నాలుగు వేలు తెచ్చి పద్మ చేతిలో పెడుతూ “ఇంకేదైనా సహాయం అవసరం పడితే అడుగు.” చెప్పాడు వంశి.
రెండుచేతులెత్తి నమస్కారం చేసి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది పద్మ.
“అమ్మా యాక్సిడెంట్ ఐతే చనిపోతారుగా?” ప్రశ్నించాడు అక్కడే ఉండి వాళ్ళమాటలన్నీ వింటున్న చింటూ.
“నువ్వుపాలు తాగేసావుగా ఇంక కాసేపు కూర్చుని హోం వర్క్ చెయ్యి.” చెప్పింది సుమ వాడి ప్రశ్నకు సమాధానంగా. తండ్రివైపు చూసాడు చింటు తన ప్రశ్నకు మాధానం వస్తుందేమోనని. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న వంశీ మొహం చూసి తిరిగి ప్రశ్నలేమీ వేయకుండా స్కూలు బ్యాగు తెచ్చుకుని అక్కడే కూర్చొని బ్యాగులోంచి నాలుగు పెన్సిల్స్ ఓ పక్కన పెట్టుకుని షార్పనర్ తీసి ఒకటొకటిగా పూర్తిగా వాటి అంతు చూడసాగాడు.
“పాపం అతను తెచ్చే డబ్బే ఆ ఇంట్లోవాళ్ళందరికీ ఆధారం. ముసలి తల్లిదండ్రులు, ముగ్గురు చిన్నపిల్లలు... ఇకపై ఎలా బతుకుతారో ఏమిటో!” నిట్టూర్చింది సుమ.
“అవును ఇంటికి ఆధారమైన వాళ్ళకి అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ ఇంటిల్లిపాదీ రోడ్డున పడ్డట్టే.” చెప్పాడు వంశీ.
పద్మ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వేరే కుటుంబాలలో ఇలా జరిగిన వాటిగురించీ మాట్లాడుకుంటూ ఉండిపోయారు చాలా సేపటివరకూ.
“మాటల్లో పడి టైమే చూసుకోలేదు రెండు గిన్నెలు తోముకుని వంట చేసేస్తా...,ఉదయాన్నే లేవాలిగా.” అంటూ లేచింది సుమ.
“అమ్మా..." పిలిచాడు అమ్మకీ నాన్నకి మధ్య పడుకున్న చింటూ. “కాలు విరిగిపోయిన వాళ్ళు ఎలా నడుస్తారు? ఇంకెప్పుడూ పడుకునే ఉండాలా?”
“వీల్స్ చైర్ లో కూర్చొని తిరగొచ్చురా. కర్రల సాయంతో కూడా నడవగలరు.” వాడికి బదులిచ్చాడు తండ్రి.
“పద్మవాళ్ళ వెంకటేష్ ఇంక నడవలేడు, వాళ్ళకి కష్టం డబ్బులుండవు అన్నావుగా డాడీ అమ్మతో.”
“నువ్వు ఇంక నిద్రో నాన్నా లేటయ్యింది.” టాపిక్ మార్చడానికి ప్రయత్నించింది సుమ.
“డాడీ ఒకపని చేద్దామా రోజూ కింద కూరగాయల బండివాడు లేటుగా వస్తున్నాడని అమ్మ కి కోపం వస్తుంది కదా. పాపం పద్మ వాళ్ళ వెంకటేష్ ఇంక రిక్షా నడపలేడుగా, మన అపార్ట్మెంట్ లో కూరగాయల కొట్టు పెట్టుకోమందామా? షాప్ కీపర్ అంటే నడవక్కర్లేదు. కూర్చునే వుండొచ్చు.”
చింటూ మాటలకు ఆశ్చర్యంగా చూసింది. వాడిని అమాంతంగా దగ్గరకు తీసుకుని ముద్దాడాడు వంశీ.
"చూసావా? వీడి చిట్టిబుర్రలో ఆలోచనలు.. మన పెంపకం సరిగ్గా సాగుతుందని ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా?" అన్నట్టు చూశాడు సుమకేసి.
సమాధానంగా వంశీ చేతుల్లోంచి చింటూని లాక్కుని ముద్దు పెట్టుకుంది సుమ.
** ** ** ** ** ** **