పుస్తకాలు - 2

6:43 PM at 6:43 PM

మొదట్లో వాటినీ న్యూస్ పేపర్లలా అలా చదివి ఇంకోళ్ళకెవరికైనా ఇచ్చే ఓ అలవాటుండేది. ఆ వయసులో చదివిన పుస్తకం నాల్గేళ్ళు పోయాక చదివితే కొత్తగా అన్పించేది, వయసును బట్టీ ఆ కథలు కలిగించే ఆలోచన్లలో అనుభూతుల్లో తేడాకనిపించేది. మళ్ళీ ఒకసారి చదువుదాం అనుకున్నప్పుడలా మళ్ళీ కొనుక్కోవటం, కొన్ని దొరక్కపోవటం ఇవీ పుస్తకాలు పోగేయటానికి కారణాలు. ఇప్పటికీ నా దగ్గరున్న వాటికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ. ( ఎవరికన్నా ఓ పుస్తకం ఇచ్చి నాల్గురోజులు పోయాక అడిగి చూడండి అది మరొకరికి ఇచ్చాననే చెప్తారు ఎక్కువమంది)
బామ్మలో అమ్మలలో చెప్పిన చిన్ననాటి ఆ కథలే సాహిత్యభిలాషకి బీజాలై ఉంటాయి సాధారణంగా.నాకు అమ్మమ్మ చెప్పిన కథలు. కథలంటేనే నాకెక్కువ ఇష్టం వంద కథలున్న పుస్తకమైనా ఇష్టంగా చదవగలను గానీ నవల నాకెందుకో బోరే! యండమూరి నవలలు ఇష్టమే గానీ, ఎక్కువగా కొన్నవి కథల సంపుటాలే. కొడవటిగంటి నుండి రావూరి భరద్వాజ వరకు, చలం, గోపీచంద్ నుండి ఇప్పటి సుంకోజీ వరకు అన్నీ ఇష్టమైనవే.

కథలు కవ్విస్తాయి, నవ్విస్తాయి, కన్నీళ్ళు పెట్టిస్తాయి. కల్లోల పరుస్తాయి! మురిపించి, వెక్కిరించేవి, సేదతీర్చేవి, ఉద్వేగంతో ఊగించేవి, ఆలోచింపజేసేవి, స్పూర్తినిచ్చేవి, దారి చూపేవి. కొన్ని నిగూఢంగా, ఇంకొన్ని వంకరగా వ్యంగంగా, డొంకతిరుడుగా చెప్పేవికొన్ని, చెల్లున వీపు చరిచేవికొన్ని. కలల్లోంచి వ్యధల్లోంచి పుట్టేవి కొన్నైతే, ఆలోచనలనీ ఆవేదనలనీ పంచేవి కొన్ని. తెలియని, ఎప్పుడూ చూడని ప్రపంచాన్ని చూపేవి కొన్నైతే.....! చుట్టూ జరిగే వాటిని ప్రతిబింబింపజేసేవి కొన్ని. కథలంటే నాకిష్టంకాదు....పిచ్చి! మంచి కథ చదివితే విందారగించినంత తృప్తిగా ఉంటుందంటారు కొందరు! నేనంత భోజన ప్రియురాలిని కాదు కాబట్టి నాకైతే ఆరోజుకి భోంచేయకుండానే పొట్టనిండినట్టు ఉంటుంది నాకు.

క్లాసురూం గోల గోల ఉంది ఎన్నిసార్లు సైలెన్స్ అని టీచర్ అరచినా వినిపించుకోనట్టే ఉన్నారు పిడుగులు. మీకో కథ చెపుతా అన్నదా అంతే పిన్డ్రాప్ :) అన్నమాటే. అన్నం తినకుండా పేచీపెట్టే చంటాడు కథ మొదలెట్టగానే నోరుతెరచి వింటాడు తింటూ. ఎదన్నా పని చెపితే కుర్రాడు వినిపించుకోలేదా రాత్రికి కథ చెపుతా నని లంచంపెడితే ఆ పని ఐపోయినట్టే. ఆడుకునే పిల్లల్ని పిలిచి నీతి బోధలు చేయబోతారు తాతగారు. అబ్బా క్లాసు పీకుతున్నాడు బాబో అనుకునే పిల్లలు ఓ నీతిథల పుస్తకం చేతికిస్తే అవే బోధలు హాయిగా చదివేస్తారు.
చిన్నప్పుడు రెక్కలగుర్రంపై రాకుమారుడు వెళుతున్నాడంటే సంబరంగా దాన్నలాగే ఊహిస్తాం. పెద్దయ్యాక అది అసంబద్దమైంది అంటాం! ఏడు చేపల కథ తెలియని వాళ్ళుండరేమో, అలీబాబ, గలీవర్, అల్లాద్దీన్..ఇలా చెప్పుకుంటూపోతే అప్పుడు మనల్ని మరిపించే కథలెన్నో..... అందుకే కొన్ని కథల్ని కథల్లానే చదివితే బావుంటుందనిపిస్తుంది నాకు.
అబ్బే ఈ కథలోలా మేంలేము దిన్నసలు ఒప్పుకో అంటాం! అందరిజీవితాలూ ఒకేలా సాగితే వాటినే కథలుగా రాయాల్సిన అవసరమేముంది! నేనెప్పుడూ చదువుతున్న కథ నాకు మ్యాచ్ :) అయ్యిందా అని అనుకొని చదను. అసలెందుకు మ్యాచ్ :) అవ్వటం! ఒక్కోరికి ఒక కథ ఉంటుంది మన సంగతి కాసేపు పక్కన పెట్టి వాళ్ళ కథేమిటో వినాలనే కుతూహలం కథని మరింత ఆసక్తిగా చదివిస్తుంది. కథలు కొన్ని కల్పితాలు ఐనా వాస్తవమనే బ్రమ కలిగిస్తాయి, కొన్ని వాస్తవాలు ఐనా నమ్మశక్యం కాదు! ఏవైనా సరే ఆ కథ నన్ను తనతో ఈడ్చుకుపోయి నన్ను నేను మరచిపోయేలా చేసిందంటే....., ఆ కథలో పాత్రలతో పాటూ కలిసి ప్రయాణం చేస్తూ చివర వారితో వీడ్కోలు కష్టంగా ఉందంటే..., అంటే .....:) మరదే కథ! మనసుని కదిలించేదే నాకు మంచికథ!
చుట్టూ అందరూ ఉన్నారు బయటకి నవ్వొద్దు బ్రెయిన్ ఓ వైపు సూచనలిస్తూనే ఉంటుంది, అది ట్రైనా, బస్సా ఎక్కడున్నాం... చదువుతున్న కథలో పాత్రలు వదలకుండా పట్టి పీడిస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చేస్తుందంటే......:) మరదే కథ, మహా మంచి కథ.
చదువుతోంటే ఉద్వేగం ఊపేసిందా, కథలో పాత్రలు జీవమున్న మనుషులుగా అనుభూతి కలిగించాయంటే...., వాళ్ళు ఎక్కడో ఉన్నారని ఆ తరువాత కూడా ఎప్పుడూ అనిపిస్తూ ఉందంటే......, పాత్రలు వ్యక్తులు గా మారి గుర్తొస్తున్నారంటే........:) ఆ... కథే కథ!
చదువుతూ ఉంటే గుండె పట్టేసి, కళ్ళు చెమ్మగిల్లాయంటే....., పూర్తయ్యాక ప్రపంచం శూన్యంగా, బుర్ర మొద్దుబారి పోయిందంటే... అద్గదీ కథ.
జ్ఞాపకాల తేనెపట్టుని తట్టి లేపుతుందా... ...చిచ్చుపెడుతుందా... ఊ.....కథే ....... :)
వింత లోకాలని చూపి విస్మయ పరుస్తుందా! ఊహల ఉయ్యాలలో ఊగిస్తుందా ఐతే పొట్టనిండే కథే!
అసలింతకు చెప్పొచ్చేదేంటంటే కథలపుస్తకాలు నాకిష్టం. చక్కటి శిల్పం, కథనం, కమ్మటిభాష, శైలీ ఉన్నాయంటే ఆకథ ఎవరిదైనా నాకు ఓకేనే :)