ఒక యోగి ఆత్మకథ

5:20 PM at 5:20 PM

నేను యోగ లో డిప్లమో చేస్తున్న సమయంలో ఆ కోర్స్ కి సంబంధం లేక పోయినా యోగ, యోగి అన్న పేరున్న ప్రతి పుస్తకమూ కొనేదాన్ని. అలా నాకు పరిచయమైనదే 'Autobiography of a yogi.'
కొంతకాలం నా దగ్గరున్న ఆ పుస్తకం పుస్తక ప్రియులెవరో దోచిన కారణంగా ఈ మధ్య మళ్ళీ కొన్నాను. ఈ సారి తెలుగు వెర్షన్‌ 'ఒక యోగి ఆత్మ కథ.'

శ్రీ పరమహంస యోగానంద రాసిన వారి ఆత్మ కథే ' ఒక యోగి ఆత్మ కథ.'యోగి జీవితం, యోగ విద్యలు వీటిగురించి స్వయంగా ఒక యోగి రాసిన గ్రంధం ఇది. పుస్తకంలోని ముందు మాటలో ఎంతో మంది ప్రశంసలు అందజేసారు. అందులో ఒకటి ఇలా ఉంది.... "ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని, ఎన్నడూ విని ఉండనంత విశిష్టమైన ఒక వ్యక్తిత్వన్ని సాటిలేని శక్తి తోనూ స్పష్టతతోనూ ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది; పాఠకుడు ఆద్యంతం ఉత్కంఠతతో నిండిపోతాడు.... కేవలం మానసికమైన ఆధ్యాత్మికమైన మానవ కృషి మాత్రమే శాశ్వతమైన విలువ ఉన్నదనీ, మానవుడు తన ఆంతరంగిక శక్తి తో భౌతికమైన అవరోధాలనన్నింటినీ జయించ గలడనీ ఈ పుటల్లో తిరుగు లేని ఋజువు లభిస్తుంది.... ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకువచ్చే శక్తి ఈ ప్రముఖమైన జీవిత చరిత్రకుందని మనం ఎంచాలి."

మొదటి సారి నేను ఈ పుస్తకం చదివి నప్పుడు ఆ నాల్గు రోజులూ కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతి. చదువుతున్నంత సేపూ సంభ్రం, ఆశ్చర్యం నన్ను ముంచెత్తుతూనే ఉంది.
రెండవ సారి నింపాదిగా, కులాసాగా చదువుకున్నాను. మళ్ళీ అబ్బురపడ్డాను, ఆశ్చర్య పోయాను!
సరళమైన శైలీ, అద్భుతమైన సంఘటనల చిత్రణ. ఆద్యంతమూ వదల కుండా చదివించేస్తుందీ పుస్తకం.

సనాతన భారతీయ ధ్యాన ప్రక్రియ అయిన క్రియా యోగాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయటమే పరమ హంస యోగా నందుల జీవిత కర్తవ్యం అని ఆయన గురువు గారి జోస్యం. ఆ దిశగానే ఆయన జీవితం సాగుతుంది.
ఆయన కి తారసపడిన యోగుల ఫొటోలు మధ్య పేజీల్లో పొందుపర్చారు.

బాల్యం తో మొదలెట్టి కుటుంబము, విద్యాభ్యాసము, తన గురువుతో గడిపిన రోజులు..తనకి తారసపడిన యోగులు, ఎదురైన సంఘటనలు, ఆయన కలుసుకున్న మహాత్ములు ఇతర యోగుల గురించి, వారి అద్భుత శక్తుల గురించి ఆసక్తి కరమైన ఎన్నో సంగతులు వివరిస్తూ అన్నింటివెంటా మనల్ని పరుగులు పెట్టించేస్తారు. . ఆయన నిర్మల భక్తి, దృఢ విశ్వాసము చదువరులను ముగ్ధులను చేస్తాయి.
ఎన్ని సార్లు చదివినా విసుగు పుట్టించనిది, ఏ పేజీయైనా నేరుగా తెరచి చదువుకోగలది 'ఒక యోగి ఆత్మ కథ.'...........................................................................