నవ్వుతున్న ఏడుపు

4:05 PM at 4:05 PM

ఈ రోజు కూడా లేటైయ్యింది, చిన్నూ ఏడుస్తాడేమో! ఇయర్ ఎండిగ్ మూలంగా పనెక్కువగా ఉంది. ఏదో అలసట, చిరాకు మొరాయించే మనసు, శరీరాల్ని లాక్కెడుతూ ఇంకెంత కాలమో!
“వావ్ యువార్ లుక్కింగ్ వెరీ స్మార్ట్ టుడే!” గుట్కా నములుతూ వెకిలిగా నవ్వుతున్నాడు మేనేజర్.
ఎప్పుడూ అతికించుకునే ప్లాస్టీక్ నవ్వు తో అతని వైపు చూసి బయటకి నడిచాను.

బండి కూడా నాలాగే తయారయ్యింది! బ్యాటరీ వీక్ అయినట్టుంది, సర్వీసింగ్ కి ఇవ్వటానికి టైమేది! దిగి స్టాండ్ వేసి కిక్ రాడ్ పై నా విసుగంతా కుమ్మరించేశాను. నేను మాత్రం నువ్వంటే పడతానేమిటీ? అన్నట్లు అది రివర్స్ లో కాలిని విసురుగా తాకింది, మరింత విసురుగా నా కాలు దాన్ని నెట్టింది, అబ్బా ఏదో అయ్యింది, ఒహ్ కాలి గోరు లేచి వేలాడుతూ ఎర్రగా రక్తం! బండి నన్ను చూసి నవ్వినట్టనిపించింది. రియర్ మిర్రర్ లో నా మొహం కూడా నవ్వుతున్నట్టుగానే ఉంది!
వెర్రినవ్వు అలవాటై పోయింది! నాన్న కొట్టినా, అమ్మ తిట్టినా, అన్న తన్నినా మనం ఏడిస్తే ఓదార్చే వాళ్ళుండరని అర్ధమైన పసివయసులోనే ఏడుపు ఇంకి పోయింది.
ఆడ పిల్ల కి సహనం, దయ, కరుణ తప్పించి మరొక ఎమోషన్‌ ఉండకూడదని ఇంట్లో శిక్షణ మొదలైనప్పుడే పెదాలపై వెర్రి నవ్వు అతుక్కుంది.
కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ప్రతి స్పందన ఆడదానికి నవ్వే నని మెదడు చిన్నప్పుడే నేర్చేసుకుంది.

పళ్ళు బిగపట్టి మళ్ళీ కిక్.. ఉఫ్ స్టార్ట్ అయ్యింది.

రోడ్డు పై లైట్లు వెలుగుతున్నాయి. చల్ల గాలి దయగా పలకరిస్తోంది. కాలికింద జిగటగా రక్తమేమో! హాస్పెటల్ ముందు నుండి వెళుతున్నా, వెళ్ళి గోరు తీయించి డ్రెస్సింగ్ చేయించుకుంటే..! అమ్మో ఒద్దు ఇంకా లేటౌతుంది, హాస్పిటల్ వైపు చూసాను బైట జనాలు పడిగాపులుకాస్తున్నారు. ఎలాగో ఇల్లు చేరితే మెల్లిగా గోరు పీకి పడేస్తే సరిపోతుంది, ఇక్కడ టైమ్‌ వేస్టు.
ఏడుపొస్తే ఎంత బాగుండు! ట్రాఫిక్ సిగ్నల్ ఆపక తప్పదు! పక్కనే బైకు ఆపుకుని బైటకి గట్టిగా ట్రాఫిక్ ని తిట్టుకుంటున్నాడు ఎవ రో ఒక అతను.
నాకు తెలుసు ఇప్పుడూ నా నవ్వు చెరిగి పోనిదని, హాయిగా అలా చిరాకు పడగలిగితే బాగుండు!

హమ్మ ట్రాఫిక్ వదిలారు, ఇంకొక్క సిగ్నల్ దాటేస్తే ఇంటికి చేరినట్టే! ఆడవాళ్ళకి ఇంతసేపు పనెందుకు ఉంటుంది..! మా ఆఫీసు లో నాలిగింటికే బయలుదేరుతారు అంటాడు మాటి మాటికీ ఆయన!

పక్కన ఫుట్ పాత్ పై పడి దొర్లు తున్న పిచ్చి మనిషి! ఏది సున్నితమో అక్కడికి చేరుతుందేమో ప్రతి బాధ!
గుండె పట్టేసినట్టు గా ఉంది, ఏదో తెలియని బాధ.

ఇల్లు వచ్చేసింది, ఒక స్టెజ్ పైనుండి మరొక స్టేజ్ పై నటన! జీవితమంతా ఇంతేనా!

చిన్నూ గేటు దగ్గరే వెక్కుతూ నిల్చుని ఉన్నాడు, బండి కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు.

“అమ్మా త్వరగా వస్తానన్నవ్? మళ్ళీ లేటు గా వచ్చావ్.”

వాచ్ మెన్‌ చేతికి బండి ఇచ్చి పార్కింగ్ లో పెట్టమని సైగ చేస్తూ, “ఏవయ్యింది?” అడుగుతూ చిన్నూని దగ్గరకి తీసుకున్నాను..

"అట్లాస్ తెచ్చావా?" సందేహంగా అడిగాడు.

"అయ్యో మర్చి పోయా నాన్నా!, చీ దానికేనా ఏడుపు ఏడవకూడదు." వాడిని ఓదారుస్తూ లిఫ్ట్ వైపు నడిచాం.

“నా వైట్ షూ చిల్లు పడిపోయింది కొనుక్కోవాలి త్వరగా రమ్మని చెప్పాగా, ఈ రోజు పీఇటీ సార్ కొట్టాడు! నాన్న ని అడిగితే నాన్న కూడా కొట్టాడు.” వెక్కుతూ చెప్పుకుపోతున్నాడు.

“రేపు తప్పక కొంటాను నాన్నా నువ్వు బంగారు కొండవు కదు ఏడవకూడదు, నాన్న ని విసిగించావా?”
కందిన వాడి లేత బుగ్గల్ని కళ్ళు హృ దయానికి చేరవేసాయి, అది భోరు మంటూ ఉంది.

రక్తం తో అతుక్కు పోయి రానంటున్న చెప్పు ని బలవంతంగా లాగి పడేస్తూ ఉంటే, హాల్లో టీవీలోంచి తల ఎత్తి గుర్రు గా చూసి నా చిరునవ్వు పలకరింపు తో మళ్ళీ టీవీ లో పడిపోయింది అత్తయ్య.

రామ కోటి పేపర్లు మడతపెడుతూ, "వీడి అల్లరి ఎక్కువై పోయింది, ముఖ్యమైన వార్తలు వినకుండా ఇంట్లొ ఒకటె గొడవ ఏడుపు. మళ్ళీ పదిన్నర తరువాత గానీ చూపించరు పూర్తి వార్తలు!"
విసుగ్గా ఆరోపిస్తున్నట్లుగా గట్టిగా చెపుతూ నా వెనుక నక్కిన చిన్నూ ని ఉరిమి చూశాడు మామయ్య.

అయ్యో అలాగా అన్నట్లు హావ బావాలు చూపుతూ లోనికి నడిచాను.

"పాపం వాడికి ఒహటే తల నెప్పిట అలసిపోయి ఆఫీసు నుండి వచ్చాడు పడుకో నివ్వకుండా వీడు ఊరికే సతాయించేస్తూ ఉన్నాడు." తన కొడుకుపై జాలి పడిపోయింది అత్తయ్య.

“అయ్యో ఏరీ ! పడుకున్నారా! టీ తాగారా, డిస్ప్రిన్‌ ఉండాలి ఇంట్లో, వేసుకున్నారా?” కుశలమడుగుతూ బాత్రూం లో టాప్ కింద కాలు పెట్టి నీళ్ళు వదిలా చుర్రు మంది.

“ఆ.. టీ తాగక? నువ్వొచ్చి ఇచ్చే వరకు ఎదురుచూడాలా, ఐనా వాడికి పెళ్ళం చేతి టీ తాగేంత అదృష్టమా!” హాల్లోంచి అత్తయ్య మాటలు వింటూ గోరు లాగిపడేసి, కట్టు కట్టుకుని, ఇల్లాలి వేషం కట్టుకున్నాను.
మిరపకాయ బజ్జీలు తెచ్చుకుతిన్నట్లున్నారు, టేబుల్ పై వదిలేసిన ముక్కలకి ఎర్ర చీమలు పట్టి ఉన్నాయి. చిన్నూ అటువైపు వెళ్ళకు జాగ్రత్త నా వెంటే తిరుగుతున్న చిన్నూ ని హెచ్చరిస్తూ గబ గబా శుభ్రం చేసి వంట పనిలో పడిపోయాను.

తిన్నా తినకపోయినా రెండుపూటలా వంట చేయక తప్పదు. పెళ్ళైన నాల్గు నెలలకే, కోడలు సరిగా అన్నం పెట్టలేదనీ, పాచి కూరలూ, అన్నం తిన్నామనీ కూతురితో చెప్పుకుని బంధువుల్లో దోషి గా నిలబెట్టేసారు.
“అన్నం తినకుండా ఎలా బ్రతికున్నారు? నా పై అభాండాలు వేసి ఇక్కడ అన్నం లేకుండా ఉండడమెందుకు? అంత బాగా చూసుకునే మీ అన్నలు ఎవరో ఒకరి దగ్గరa ఉండొచ్చుగా!” అంటూ భర్తనడిగింది ఆ రోజు.

“అన్నయ్య ల్లా నేను పెళ్ళాం చాటు వాజమ్మ ని కాదు! తల్లీ తండ్రీ తరువాతే నాకెవరైనా! నేను పెళ్ళి చేసుకున్నదే వాళ్ళకోసం, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరనే నిన్ను చేసుకుంది. అత్తా, మామ లకి తిండి పెట్టడం కూడా నీకు బరువైన పనా? మీ వాళ్ళైతే ఇలాగే చేసేదానివా?”
భర్త మాటలకి సమాధానం చెప్పి ఒప్పించటం కన్నా ఓ పూట వంటే తేలికనిపించింది.

“అమ్మా ఆకలి” చిన్నూ మాటలకి ఈ లోకం లోకి వస్తూ వాడికి అన్నం కలిపి “ఇదిగో నేను కలిపింది అంతా వదిలేయ కుండా తినేయాలి వెళ్ళి హాల్లో కూర్చో.
అత్తయ్యా, మామయ్య గారు వడ్డిస్తున్నాను రండి” అందమైన చిరునవ్వు తో కూడిన నా పిలుపు అందుకొని లేచారు వాళ్ళు.

“మోకాళ్ళ నెప్పి అడుగు తీసి అడుగు వేయలేక పోతున్నా, రాధ దగ్గరున్నప్పుడు వారం, వారం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేది! అది మాత్రం ఉద్యోగం చేయడం లేదా ఏమిటి? నీలా రాత్రుల దాకా బయట తిరుగుళ్ళు దానికి లేవు ఇంటిని చక్కదిద్దుకునే సంసార లక్షణాలు గలది!”
తమని తరిమేసిన పెద్ద కోడలి గొప్పలు అత్తగారి నోటంబడి వినటం అలవాటై పోయింది.

“అయ్యో నెప్పి ఎక్కువగా ఉందాండీ! రేపు తప్పకుండా హాస్పెటల్ కి వెళదాం! మందులు ఉన్నాయిగా, రోజు వాడుతున్నారా?”

“ఆ ఉన్నాయిలే! పాడు మందులు పనిచేస్తాయా పాడా! ఇదేంటే.. వంకాయ వేయించావు? మేం భూమ్మీద ఇంకో నాల్గు రోజులు ఉండాలా వద్దా!” పళ్ళెం లో మరి కాస్త వంకాయ వేసుకుని తింటూ ధీర్ఘాలు తీస్తోంది.

“ఏంటీ సాంబారు చల్లగా ఉంది?” మామయ్య మాటలకి నా మతి మరపు ని తిట్టుకుంటూ సాంబారు గిన్నె తీసుకుని స్టౌ వైపు నడిచాను, వెనక వాళ్ళ మటలు వినిపిస్తూనే ఉన్నయి.

“సంధ్య పోన్‌ చేసిందని చెప్పావా?”

“ఏదీ మహారాణీ గారు ఇప్పుడేగా ఇంటికి చేరింది.”

వాళ్ళ ఒక్కగానొక్క కూతురు సంధ్య ఫోన్‌ చేసిందంటే ఏదో పెద్ద ఖర్చు మీదపడపోతుందన్నమాటే!

చిన్నూ పిలుస్తూన్నాడు “అమ్మా తినేసా.”

“గుడ్ వెళ్ళి పడుకో నాన్నా.” నా మాటలకి బుద్దిగా బెడ్ రూం కేసి వెళుతున్న చిన్నూ తో పాటు పరుగు పెడుతున్న మనసునీ, శరీరాన్నీ బలవంతంగా ఆపి పనిలో మునిగి పోయాను.

“సాంబారు వేసుకోండి, జాగ్రత్త వేడిగా ఉంది.”

“కొద్దిగా చాల్లే ఏదీ ఎక్కువ తినలేక పోతున్నా! ఉదయం సంధ్య ఫోన్‌ చేసింది వచ్చే వారం లీవు తీసుకో మళ్ళీ దొరకలేదంటావు” చెపుతూ తన భార్య వైపు చూసాడు మామయ్య మిగతాది నువ్వు చెప్పు అన్నట్టుగా.

“సంధ్య ఫోన్‌ చేసింది, నీకూ చేస్తే ఎంగేజ్ వచ్చిందట. వచ్చే శుక్రవారం అపార్టుమెంటు గృహప్రవేశం పెట్టుకున్నారట. ఇల్లు కొన్నుక్కుని రెండేళ్ళైనా కాలేదు మళ్ళీ అపార్టు మెంటు కొన్నుక్కున్నారని అందరూ తెగ ఏడ్చి పోతున్నారు అందుకే సింపుల్ గా చేస్తున్నాం అని చెప్పింది. అన్నా తమ్ముళ్ళు అంటూ ముగ్గురున్నారు ఏం లాభం? ఏదన్నా ఘనం గా చదివించాలి ఈ సారి!
నీకు మీ అన్నయ్య ఇచ్చాడు చూడు అలాంటి వెండి అష్టలక్ష్మీ బిందే, నిలువెత్తు దీపపు సెమ్మెలూ తీసుకు రమ్మని చెప్పింది. పాడు ఉద్యోగం వల్ల తీరికే దొరకదు వచ్చి పిలవలేక పోతునాను అని ఒకటే బాధ పడిందనుకో. పాపం అన్నీ అదే చూసుకుంటుంది ఒంటరి కాపురం !”
ఎప్పటిలాగే కూతురి ఎంత కష్టపడి పోతొందో వివరించడం మొదలెట్టింది అత్తయ్య

నాకు అన్నయ్య ఇచ్చాడా? పెళ్ళి లో పీడించి నాన్న దగ్గర వసులు చేసింది వీళ్ళేగా! ఎంత లోగా అందంగా ఎలా మార్చేశారు విషయాన్ని! ఆమె ఒక ఇల్లు కట్టి సంవత్సరమైనా కాలేదు అప్పటి గృహ ప్రవేశానికి వెండి డైనింగ్ సెట్టు కావాలి అంటూ దాదాపు వెండి వంటపాత్రలు అన్నీ కొనిపించుకు వెళ్ళింది! మళ్ళీ ఇప్పుడు...!

“వింటున్నావా? అన్నా తమ్ముళ్ళు బాగా సంపాదిస్తూ ఉన్నారు, ఏం లాభం? ఒక్కగానొక్క ఆడపిల్ల ప్రతి దానికీ దేవిరించుకొని అడుక్కోవలసిందే! నువ్వో రోజు లీవు పెడితే వెళ్ళి కొనుక్కు రావచ్చు అలాగే దానికీ, అల్లుడుకీ, పిల్లలకీ బట్టలు కూడా తీయాలి.”
నా తల గంగిరెద్దు లా ఆడుతోంది, పెదాలపై చిరునవ్వు తాండవిస్తోంది. నా మొహం లోకి పరీక్ష గా చూస్తూ చెప్పుకు పోతోంది అత్తయ్య. తను ఆశించిన చిరునవ్వు నామొహం లో చూసిందేమో ఎక్కువ రాద్దాంతం లేకుండా భోజనాలు ముగించి టీవీ ముందు సెటిల్ ఐపోయారు ఇద్దరూ.

“ఏవండీ! మీరూ రండి.. భోంచేద్దురు గానీ,”

“అమ్మా, నాన్నా సరిగా భోంచేసారా? ఎందుకింత లేటు చేస్తునావు? ఇలాగైతే వాళ్ళ ఆరోగ్యం ఏమౌతుంది? నీకస్సలు శ్రద్ద లేకుండా పోతోంది!” భోజనానికి కూర్చుని తల్లీ తండ్రీ వినేట్టు క్లాసు పీకడం మొదలెట్టాడు.

హు.. చిన్నవాడు ఆరోగ్యంగా పెరగాల్సిన వాడు తిన్నాడో లేదో పట్టదు వీళ్ళకి! ఇంత మందిలో వాడు ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ పెరుగుతున్నాడు! సొంత గా పెట్టుకు తినగలిగే వాళ్ళకి మాత్రం ఒకరు దగ్గరుండి చూసుకోవాలిట!

“ఏంటీ మొహం అదోలా పెట్టావ్?” అడుగుతున్న ఆయన్ని నమ్మలేనట్టు చూసాను.
ఓహో నా మొహం అదోలా కూడా మారుతుందా! వాష్ బేసిన్‌ దగ్గరున్న అద్దం లోని నా మొహం లోని చిరునవ్వు నన్ను నిరాశ పరిచింది.

“సాంబారు చల్లారి పోయింది.”

“మళ్ళీ వేడి చేసి తీసుకొస్తా.”

“ఇల్లంతా చెత్త కుప్ప లా తయారైయ్యింది! ఓ రోజు లీవ్ పెట్టి సర్దేయకూడదూ?”

“ఈ సండే ఓ రెండు గంటలు ముందుగానే లేచి సర్దేస్తా.” ఇంటి అందమే కదా, ఇల్లాలికి ముఖ్యమైనది.

వెండి బింది, సెమ్మెలు పుణ్యమాని వ్యంగపు బాణాలు లేకుండా ఈ రోజు భోజనాల కార్యక్రమం ముగిసింది. ఒంటరిగా ఎంత సేపైనా పనిచేసుకోగలను గానీ ఈ గంట భోజనాల తంతు ముగిసేసరికి నీరసం ముంచుకొచ్చేస్తుంది!
ఈ నా ఇంటిలో ఎక్కువ సేపు నేను గడిపే స్థలం ఈ ఎనిమిదడుగుల వంటగదే!
ఎంతసేపు, ఓ ఐదు గంటలు అలా పడుకుని ఇలా లేచి వచ్చేయనూ.. వంటగదితో వీడ్కోలు పలికి నడిచాను మరో స్టేజ్ పైకి మరో పాత్ర లోకి.
“చీ అలసిపోయినట్టు ఉంటావు ఉత్సాహంగా ఉండొచ్చుగా! పెద్ద ఉద్యోగం నువ్వొక్క దానివే చేస్తున్నావా! మా ఆఫీసుకొచ్చి చూడు ఆడవాళ్ళు ఎలా ఉంటారో పిట పిటలాడుతూ.”

పిడికెడంత హృదయం నెప్పి తట్టుకోలేక మూలుగుతోంది. పెదాలపై వెర్రి నవ్వు ఉండే ఉంటుంది!
జీవితం లో తీరని కోరిక మళ్ళీ మనసులో పురి విప్పుకుంటుంది, దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలని..
అమ్మో ఇప్పుడు ఏడవడానికి టైమ్‌ ఏదీ! పొద్దున్నేలేవాలి, స్టేజ్ పై నవ్వులు పూయించడానికి.
~~~~~~~~~~~~~~~~~~

32 comments:

Srividya said...

చాలా బాగా రాసారు రమ్యగారు. చదువుతున్నంతసేపు ఇంతేనా జీవితం అన్న బాధ..చివరిదాకా ఆపకుండా చదివించారు.

Kathi Mahesh Kumar said...

చక్కటి కథ. సహజత్వానికి దగ్గరగా కథనం. నిజమైన పాత్ర చిత్రీకరణ.అతి ముఖ్యమైన సామాజిక విషయం. మంచి కథకు ఇంతకన్నా ఏంకావాలి?
నా అభినందనలు.

Rajendra Devarapalli said...

simple yet touching,write my comment in detail later

సిరిసిరిమువ్వ said...

చాలా సహజంగా ఉంది కథ. అభినందనలు.

కొన్ని కథలు నిజ జీవితాలికి దగ్గరగా ఎక్కడో గుండె లోతుల్ని తడుతుంటాయి, మీ ఈ కథ కూడా అలాంటిదే.

MURALI said...

కాలం ఇంత వేగంగా మారుతున్నా ఇంకా ఆడవాళ్ళ జీవితాలు ఇలానే ఉన్నాయా? నా తల్లి,చెల్లి లానే తను కూడా అనే మగవాళ్ళు ఇంకా పుట్టలేదా? నా కూతురి లాంటి అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి అనే అత్తమామలు ఇకరారా?...ఎంటో ఈ ప్రపంచం.

Purnima said...

కథ బాగుంది. మనం వేసుకునే అనేకానేకమైన ముసుగుల్లో ఈ నవ్వూ ఒకటేమో!!

నిషిగంధ said...

చాలా బాగుంది రమ్య గారూ.. సగటు ఉద్యోగిని జీవితంలోని ఒక రోజుని కళ్ళకు కట్టినట్టు చూపించారు..

"ఒంటరిగా ఎంత సేపైనా పనిచేసుకోగలను గానీ ఈ గంట భోజనాల తంతు ముగిసేసరికి నీరసం ముంచుకొచ్చేస్తుంది!"
నిజంగా మన మానాన మనల్ని వదిలేస్తే ఎంత పనైనా చేసుకోవచ్చు.. కానీ దానితో పాటు, వ్యంగ్య బాణాలు, విసుర్లు కలిస్తే మాత్రం తట్టుకోవడం కష్టం!

మీనాక్షి said...

రమ్య గారు చాలా బాగా రాసారు.
ఇది కథ కాదేమో..అనిపించింది.
అన్నీ సన్నివేషాలు కళ్ళ ముందే జరుగుతున్నాయా
అనిపించింది.నన్ను కదిలించింది.
నిజంగానే జీవితం ఒక నాటకం.
ఈ నాటకం లో ఎన్ని పాత్రలు వేయాలో..
ఆ నవ్వు అనే ముసుగు వేసుకుని.

చైతన్య.ఎస్ said...

చాలా సహజంగా ఉంది మీ కథనం. కోడలు నా కూతురు లాంటిదే అనే భావన ఎందుకు రాదో మరి నాకు అర్థం కాదు. నేను నిజ జీవితం లో అలాంటి వాళ్ళు ను చూశా. కోడలు ఉద్యోగం చెస్తే ఊరు తిరిగినట్టు, అదే ఉద్యోగం చెయ్యని కూతురు ఎక్కడ తిరిగిన పర్లేదు. ఇంట, బయట పని చెసుకొన్నా కుడా భర్తకు, అత్తకు, మామకు అదేంటొ కాని సంతృప్తి ఉండదు. ఎదో వాళ్ళు దయతలచి ఉద్యొగం చేసుకొవడానికి అనుమతి ఇచ్చినట్టు భావన. కాని నెల మొదట్లో మాత్రం జీతం రాగానే వాడుకోవడానికి రెడీ (ఎక్కువ అయ్యిందేమో కాని నిజ జీవితం లో నేను ఇలాంటి ఒక కుటుంబాన్ని చూసా అందుకే ఇలా రాసా...).

కొత్త పాళీ said...

WOW .. double WOW!!

Srinivas said...

బావుంది. కథ పాతదే అయినా అవే పరిస్థితులు ఇంకా అలానే కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఇలా అప్పుడప్పుడూ గుర్తు చేసుకోవాలి.

Rajendra Devarapalli said...

ఇందాకే గురువుగారు కొత్తపాళీ గారు ఒక చిన్న జలక్ ఇచ్చారు,మళ్ళీ వచ్చి కామెంటురాస్తానంటున్నావ్ తప్ప రాసినదాఖలాలు ఈమధ్య కన్పడటం లేదబ్బాయ్ అని.
మనబ్లాగర్లలో చాలామందికన్నా వయసులో ముఖ్యంగా మహిళాబ్లాగర్ల కన్నా కాస్త పెద్దవాడిని కావటం తో నా చిన్నప్పటి విషయాలు ఇక్కడ ఇలా పంచుకుంటున్నాను.మా అమ్మ,అక్క ఉద్యోగాలు చేసారు,అలా వారికన్నా చాలా పెద్దవారి(మహిళల)ఉద్యోగానుభవాలను విన్నాను చాలా...
ఈదేశంలో ఉద్యోగినులు ఆరోజుల్లోపడ్డబాధలూ బానిసలుగా ఆఫ్రికన్లు పడ్డ బాధలూ సమానమనిపించేవి.అరచేయి చాటుంటే కడుపులోబరువు దించుకుందామని అనిపించిన పరిసరాల్లో ఉద్యోగాలు చేసినవారున్నారు,ఎండకు తట్టుకోలేక గొడుగేసికెళ్తె..గొప్పలు చూపిస్తుంది దీని తాడుతెగ అనిపించుకున్నారు,మొహానికి కాస్త పౌడరు రాసుకుంటే,లంజాముండకి అన్నీ సోకులెనమ్మా,ఇంకేం ఉద్యోగం చేసిసస్తదీ అనిపించుకున్నారు.బలవంతంగా పొరుగూళ్ళకు క్యాంపులు,అక్కడ చచ్చినట్లు పైఆఫీసరు చెప్పినట్లు చేసిచావాల్సిన స్తితిగతులు.ఆరోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువగా చేసినవీ,చేయనిచ్చినవీ టీచరు,నర్సు,టెలీఫోను ఆపరేటరూ ఉద్యోగాలే!ఇవ్వాళ వందలరకాల ఉద్యోగాలు,లక్షల్లో ఉద్యోగినులూ,కానీ కొంపల్లో,ఇరుగుపొరుగూ,చుట్టపక్కాలు,ముఖ్యంగా మీరుచిత్రించిన అత్తమామలు,ఆడబిడ్డలూ మారలేదు,చిత్రంగా ఈ బాపతు జనం చాలా సాంప్రదాయబద్ధంగా,మాంఛి చదువులు చదివి,తీరికవేళల్లో సాహిత్యమూ,సంగీతమూ గురించి వాగే,రాసే వారయ్యుంటారు.పెదాలపై వెర్రి నవ్వు ఉండే ఉంటుంది!---అమ్మో ఇప్పుడు ఏడవడానికి టైమ్‌ ఏదీ! పొద్దున్నేలేవాలి, స్టేజ్ పై నవ్వులు పూయించడానికి-- ఈరెండు వాక్యాలు చాలు ఆమందకు తాము మనుష్యులుగా మారాల్సిన అవసరాన్ని తెలియజేసేందుకు.

ramya said...

శ్రీవిద్యగారu, మహేష్ గారu, రాజేంద్ర గారు, సిరిసిరి మువ్వ గారు కథ ని చదివి మీస్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. మురళి గారu పూర్ణిమగారు, మీనాక్షి గారు, నిషిగంధ గార్లకి కథ చదివి మీ స్పందన తెలియయ జేసినందుకు ధన్యవాదాలు.
చైతన్య సరిగ్గా చెప్పారు చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు నిజ జీవితం లోంచే కథ పుట్టేది.
కొత్తపాళీ గారు, శ్రీనివాస్ గారు చదివి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రాజేంద్రగారు మీరు రాసింది చదివితే చాలా బాధ కలిగింది. ఏదైనా మార్పు జరుతున్నప్పుడు ముందు నడచిన వాళ్ళకి ముళ్ళ బాధ తప్పదేమో.

కల said...

fantasticఒక్క పొగడ్త, ఒక్కటంటే ఒక్క పొగడ్త, చాలు నా కష్టాన్ని ఎవరన్నా గుర్తించారన్న సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఇంట చాకిరి చేసినా గుర్తింపు లేకపొతే ఇదిగో ఇలానే ఉంటుంది.
చెప్పాలంటే నాకిది కథ లాగా అనిపించలేదు, మన పక్కనే ఎక్కడో జరుగుతున్నట్లు అనిపించింది.

ప్రతాప్ said...

చాల బాగా రాశారు. కాకపొతే టైటిలే కొద్దిగా సరిపోయినట్లు లేదన్నది నా అభిప్రాయం.

ramya said...

కల గారు అవునండి నిజమైన సంఘటననే కథ గా రూపం దాల్చింది.

కొన్ని పెయిన్స్ బయటకి చెప్పుకోనివి, చూసేవారికి ఎంతో చక్కగా సవ్యంగా కనిపించే కుటుంబాలలో లోగుట్టు కొన్ని సార్లు వేరు... ఇక్కడా అంతే చల్లని సంసారం చక్కని కాపురం నీకేం తక్కువ అంటారు పైగా.
కార్యేషు దాసి... అలా ఉండాలనీ హితవులు కూడా...

ముఖ్యంగా బయట పనిచేసేవారు వారికి అసౌకర్యం కల్గిన ప్రతిసారి ఇబ్బందిగా నవ్వే చిరునవ్వే స్పందన!

ప్రతాప్ గారు :-)

విహారి(KBL) said...

రాఖీ(శ్రావణ పూర్ణిమ) శుభాకాంక్షలు రమ్యగారు.

LENIN THUMMALAPALLI said...

ఛాలా బాగా రాసారండి. superb

RG said...

ఇంచుమించు ఈ పాయింట్ తోనే (సుఖమంటే కష్టాలు లేకపోవడమేనా అని) ఏదో నవల చదివినట్టు గుర్తు. మీరు చాలా బాగా రాశారు.

RG said...

క్షమించండి, ఆ పాయింట్ సుఖమటే కష్టాలులేకపోవడంకాదు, ఇలాగే చిన్న చిన్న, చెప్పుకోలేని, అలా అని వదిలేయలేని బాధలగురించి. రచయిత యండమూరి అనుకుంటా. It was a bad novel though.

భరత్ said...

కథ చాల బాగుంది, టైటిల్ కూడా బాగా సూట్ అయింది, సహజత్వానికి దగ్గరగా ఉంది.

దైవానిక said...

మీరు ఇలా పదాలతో ఎలా ఆకట్టుకోగలుగుతారో నాకర్థం కావట్లేదు. యాస్ యూశ్వల్గా సూపర్

ramya said...

@LENIN THUMMALAPALLI,@Falling Angel గార్లకు ధన్యవాదాలు.
భరత్ గారు,దైవానిక గారూ థాంక్యు.

BRAHMAM ? said...

Ramya Garu,
mee katha chaduvtunte naa kallanundi kanneeti dharalu. chala Sahajamga undi. You are great.

ramya said...

@kav -నా కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

punnam.blogspot.com said...

"ఒంటరిగా ఎంత సేపైనా పనిచేసుకోగలను గానీ ఈ గంట భోజనాల తంతు ముగిసేసరికి నీరసం ముంచుకొచ్చేస్తుంది!"

Anonymous said...

ఇలాంటి కథలు ఇంకా ఎన్నాళ్ళు వ్రాస్తారు..? వ్రాసిందే వ్రాస్తూ ..? ఇలాంటి కథలు ఎప్పుడు ఏకపక్షంగానే ఉంటాయి ! అదేంటో గాని ఉద్యోగం చేసే ఆ ఒక్క ఉద్యోగిని మాత్రమే మంచిగాను, నిబద్దతకలిగిన మనిషిగాను, సానుభూతి పరంగాను ఉంటుంది , మరి మిగతా పాత్రలన్నీ ఆ ఉద్యోగిని పాత్రకి వ్యతిరేకంగా ఉంటాయి. ఇది నాకెప్పుడు అర్థం కాని విషయం..! చుట్టు ఉన్న మనుషులు, సమాజం చెడుగా ఉండి కేవలం ఏ పాత్రైతే సానుభూతిగా ఉంటుందో ఆ పాత్ర మాత్రం చాలా మంచిగాను, నిబద్దత కలిగి ఔనత్యం తో కూడిన పాత్ర లాగుంటుంది..! అదెలా సాద్యం..? చుట్టు ప్రపంచం సరిగ్గ లేక పోతే ఈ ఉద్యోగం చేసె పాత్ర ఒక్కటే ఎలా వచ్చింది అంత నిజాయితిగా..? ఈ లోకం లోకి..ఆకాశం నుండి ఊడి పడిందా..? లేక మీరు అనుకొనే దేవుడు సృష్టీంచాడా ఆ ఒక్క పాత్రని...? మనం ఎలా ఉంటామో మన చుట్టు ఉన్న సమాజం ,ప్రజలు కూడ ఉంటారు. ఇక నా వ్యక్తి గత విషయమే తీసు కుంటే మా ఇంట్లో కూడ మా అమ్మాగారు ఉద్యోగిని..! ఆవిడెప్పుడు ఈ కథల్లోలాగ ఎక్కడ కష్టాలు చవిచూడలేదు..ఇంకా చెప్పాలంటే ఆవిడే పూర్తిగా అజమాయిషీ చెలాయించేది. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ మా ఇంట్లో పనిమనిషి ఉంది.! ఒక్క నా ఇంట్లోనే కాదు మా వీధిలో 80 శాతం మద్యతరగతి. దిగువ మధ్యతరగతి ఇల్లల్లో అందరికీ పని మనుషులున్నారు. సమాజం లో మీరు వ్రాసిన లాంటి సంఘటనలు నూటికి 10 లేక 15 శాతమే ఉండొచ్చు. కాని సామాజం మొత్తం అలానె ఉంది అని అనుకుంటే పొరబాటే అనిపిస్తుంది. నాణ్యానికి మరో వైపు కూడ చూడగలగాలి. ఇలాంటి కథలెప్పుడూ ఏకపక్షంగాను , సానుభూతి పరంగాను ఉంటాయి. ! కమల్..

Anonymous said...

నాణ్యానికి మరో వేపు కథ:
కమల్ వాళ్ళింట్లో వాళ్ళమ్మగారు ఉద్యోగిని. కానీ ఆవిడకి ఏమీ కష్టాలు లేవు. ఆవిడే అజమాయిషీ చెలాయిస్తుంటారు నిరాఘాటంగా. వాళ్ళ పనిమనిషి ఎప్పుడూ నాగాలు పెట్టకుండా వచ్చి చెప్పిన పనులూ చెప్పని పనులూ కూడా చక్కగా చేసేసి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడూ జీతం పెంచమని గొడవ చెయ్యదు. వాళ్ళమ్మగారి ఆఫీస్లో వాళ్ళ మేనేజరు కూడా కమల్ వాళ్ళమ్మగారు చెప్పిన మాట విని అలాగే నడుచుకూంటారు. ఇంట్లో పిల్లలు అమ్మ చెప్పిన మాట వింటారు. ఎప్పుడూ కాదనరు. ఇరుగు పొరుగు ఆవిడ కనుసన్నల మెలుగుతూ తల్లో నాలికలా ఉంటారు. అందరూ సుఖంగా ఉంటారు. ఎవరికీ ఏ కష్టాలూ రావు.
ది ఎండ్.

Anonymous said...

పాపం అజ్ఞాత గారికి బాగా రగిలినట్లుంది. వాకె మీరు చెప్పిన విషయాల్లోకే వొస్తాను నేను కూడ, నిజంగా చెప్పాలంటే మా అమ్మగారికి ఏమి కష్టాలు లేవు. ఆవిడొక ప్రభుత్వ ఉద్యోగి. అది కూడ ఒక ప్రభుత్వ బాలిక పాఠశాల, అక్కడ కూడ ఆవిడే అజమాయిషి, విధ్యార్థినీలను తన వ్యక్తిగతపనులకి ఉపయేగించుకుంటారు. నేను ఎప్పుడు గొడవే ఆ విషయం లో..వ్యక్తిగత పనులకి పాఠశాల విధ్యార్థినీలను వాడుకోవద్దు అని. ఊహ వినరు కదా..? పనిమనుషులు కూడ మనుషులే కదా..? బయట ధరలకు తగ్గట్లు జీతాలు ఖచ్చితంగా అడుగుతారు..! అది వారి హక్కు కూడ. ఇవన్ని సామాజికంగా ఉండే ఎత్తుపల్లాలు, మరి నగరాల్లో చాలా చోట్ల బాలకార్మికులుంటారే వారిని కొట్టి హింసించి పనులు చేయుంచుకుంటున్నా వారెవరూ..? కనీస జాలి, సాటిమనిషిని మనిషిగా చూసే తత్వమే ఉండదే ఈ ఇంటి యజమానులకి..? జీతమా అదెప్పుడూ వారికి కావాలసిన దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. మీరు నగరాల ఉద్యోగాలతో కాదు మా తాలుకాలో ఆ జీతం బ్రతకడానికి బాగా సరిపోతుంది.ఓహో మీరు చెప్పినట్లు అందరు ఆవిడ చెప్పినట్లే నడావాలా..? మరి ఆవిడ ఎవరి చెప్పినట్లు నడవరా..? అవును ఇంట్లో కూడ ఆవిడ చెప్పినట్లే అందరూ విన్నారు, ఒక్క నేను తప్ప! ఎందుకంట ప్రశ్నించే ఆలోచన స్థాయి ఉన్నప్పుడు. మానసిక స్థాయి పెరిగినప్పుడు ఎవరు ఇంకొకరు చెప్పిన విదంగాను లేక, నచ్చేవిదంగాను నడవరు. ఎవరికి ఉన్న మానసిక స్థాయిలో వారుంటారు. మీరు అనుకొనే ఆ "ఒకరు" కి మాత్రమే తెలుసా ఈ ప్రపంచం లేక ప్రాపంచిక జ్ఞానం..? మిగతా సమజం లో తిరిగే మనుషులకుండదా ఆ పాటి పరిజ్ఞానం..? ఎప్పుడు ఏవి ఏకపక్షంగానే ఆలొచిస్తారు..మేము మాత్రమే కరెక్ట్ ఈ ప్రపంచం లో అని. ఏదైన సరె గొడవలంటూ ఉంటే అవి రెండు వైపుల నుండి తేడాలుంటేనే వొస్తాయి. మరీ హింసా ప్రవృత్తి కలిగిన మనుషులుంటే తప్ప....! బహుశ మీకు ఏకపక్షంగా ఉండే కథలే నచ్చుతాయేమో..!..కమల్.

Anonymous said...

@కమల్
నా చుట్టూ ఎపూడూ దొంగతనం జరగలేదు. కానీ మరి ఇంకా జైల్లు మూతపడలేదు!!

ramya said...

ఆధిపత్యం చెలాయించే వాళ్లు ఉన్నారని మీరు అంటున్నారంటే....దానికి
గురయ్యేవాళ్ళూ ఉన్నారన్నది ఒప్పుకుని తీరాల్సిన నిజం. (ఆడ మగ, అత్తా కోడలా అనికాదు బలవంతులు బలహీనులు ఎప్పుడూ ఉన్నారు)
కొన్ని కుటుంబాలలో బయటకు కనిపించని హత్యలు జరుగుతుంటాయ్ వీటికి కేసులుకూడా
ఉండవు.

ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు...అని చెప్పబడలేదు. ఆ వ్యక్తుల స్వభావాలు అవి.
వాళ్ళు వేరొక సందర్భం లో వేరొకరికి వాళ్ళు మంచి వాళ్ళు అయ్యుండవచ్చు!
కథలో జరిగేదంతా ( జరగలేదు ఓ హృదయం లోని నెప్పి మాత్రమే చెప్పబడింది) చూసేవారికి అంతా సవ్యంగా కనిపించే ఏసమస్యలేని కుంటుంబంలోదే! మరి ఎప్పుడది
సమస్యగా కనిపిస్తుంది? అక్కడ హత్యో,ఆత్మహత్యో..లేదా కొద్దికాలానికి మొద్దుబారి గయ్యాలిగా మారిన ఆమె వల్ల మొదలయ్యే ఘర్షణ లో లేదా విడాకులో..

ఈ రోజుల్లో..ఇంకా ఇలాంటి కథలా ....? అవును ఈ రోజుల్లో ఇంకా సున్నిత స్వభావులు మిగిలే ఉన్నారు.
మీకు బయట అన్నీ నవ్వులే కనిపిస్తున్నాయంటే-> కంటికి కనిపించే ప్రతి నవ్వు వెనకా సంతోషం మాత్రమే ఉండదు ఒక్కో సారి అది నిస్సహాయత్వం...వెర్రితనం...కూడ!

Vinay Chakravarthi.Gogineni said...

baagundi..i can understand but.....meeru aadavaala vaipu nundi maatladutunnatlugaaa vundi.....mimmalni mee fater lalinchaleda........

i will agree with one thing ee kadhaloni atta maamala laga chaala mandini choosanu gaani.......hubby ni choodaledu.....(undaru ani kaadu gani...takuva pillala meeda prema lendid evariki adedo only ammake vuntundi ante nenu oppukonu)

okati maatram cheppagalanu ladies ila cheppukuntaru magavaalu emina badhalunte manasulo ne feel avutaru