స్త్రీలు -సినేమాలు

1:09 PM at 1:09 PM

మరీ పాతవి కొన్ని క్లాసిక్స్ అని చెప్పబడేవి చూసా, కొత్త సినిమాలు అంటే ఓ పదేళ్ళ లోపువి కొన్ని చూసాను. వాటి మధ్యలో వచ్చిన చాలా సినిమాలు నేను చూడనివే!
ఈ విషయం లో నాలెడ్జ్ మరీ పూర్ గా ఉందని.. టి వి లో వచ్చే అప్పటి సినిమాలు చూసేయాలని చానాళ్ళకిందే డిసైడయ్యా గాని అమలు పరిచే ధైర్యమే లేకపోయింది!

ఈ మధ్య రాజకీయ వార్తలు చూసీ, వినీ కూడా స్థిరంగా ఉన్నానంటే నా ఓపిక స్థాయి బానే పెరిగి పోయిందని నాకెందుకో ఓ గొప్ప నమ్మకం కలిగింది! ఇంకేం వీలుదొరికినప్పుడంతా ఆ సినేమాలు చూసేస్తే సరి! పోయేదేముంది అనుకున్నా!

అలా మొన్నో రోజు రెండు చానల్లో వచ్చే రెండు చిత్రరాజములను ఒకే సారి చూసేసా, మొత్తానికి!
ఓ దాంట్లో "మేఘసందేశం" నా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టమైన పాటలవటం వల్ల ఆ కేసెట్ తరచుగానే మోగుతుండేది. శానా గొప్ప సినెమా అని మనసులో ముద్రకూడా పడిపోయుండె!!

పాటల సంగతి పక్కన పెడితే. నా కైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు. నువ్వే సినిమా పూర్తిగా చూసావు గనక!! ఇదేనా నీ పెరిగిపోయిన ఓపిక?? అనే నా హృదయ గోస విని సరె ఈ మధ్య టీవీ న్యూసే మన ఆరోగ్యాన్ని ఏమీ చేయలేక పోయింది ఇదో లెఖ్ఖా! చూసే తీరదాం అనకునేసిన.

దీంతో బాటు మరొకటి బాలచందర్ ది సింధు భైరవి దాని పేరు.(తమిళ్ డబ్బింగు, ఈ సినిమా కి పొడిగింపు గా శహానా అనే సీరియల్ వచ్చిందామధ్య. ప్చ్ నేను చూడలే)
రెండూ మంచి సంగీతం, పాటలు కలిగిన పేరుకెక్కిన సినిమాలే .. కాని నాకు చిరాకునే మిగిల్చాయి. ( కథ వేరైనా ఈ రెండు సినిమాలూ ఒక్క కుదురు లోని మొక్కలే ననిపించింది).


స్త్రీల స్థాయి ని దిగజార్చటానికి అప్పట్లోని సినిమాలు గొప్ప కృషే చేసినట్టున్నాయి, మొన్నటికి మొన్న యధాలాపంగా ఓ సినిమా చూసా అదేంటో "కళ్ళు తెరిచిన కాళికో" ఏదో ఉంది పేరు, మాంచి మహిళా చిత్రం!

దాంట్లో ఇద్దరన్నాతమ్ముళ్ళు . అన్న మంచివాడు?! వ్యవసాయం చేస్తాడు(ఇతనికి సవతి తల్లన్నమాట),
తమ్మున్నేమో తల్లి పెద్దచదువులు చదివిస్తుంది.
ఇంక ఇటు అన్న సంసారం, అటు తమ్ముడి సంసారం మార్చి, మార్చి దర్శింపజేస్తూ ఉంటాడు దర్శకుడు.

ఓ పిచ్చి (జయచిత్రనుకుంటా ఆమె పేరు ) అమ్మాయి(ఆంటీ) ని పెళ్ళి చేసుకుంటాడు అన్న.

అక్కడ ఓ పెద్ద చదువులు చదివిన పెద్దింటి అమ్మాయిని చేసుకుంటాడు తమ్ముడు.

ఈ పిచ్చామ్మాయి ముగుడబ్బాయ్, మొగుడబ్బాయ్ అంటూ ముగుడ్ని ప్రేమిస్తూ ఉంటుంది, ఒంటిమీద సృహ ఉండదు.

ఆ పెద్దింటి అమ్మాయి మొగుడిని ఖరీదైన వస్తువులు తెమ్మని వెదిస్తూ ఉంటుంది. తెచ్చీ తెచ్చీ ఇక నా వల్ల కాదంటాడు. ఐతే నేనే ఉద్యోగం చేసి సంపాదిస్తా నని ఉద్యోగానికి వెళుతుంది.

ఆమె సరిగ్గా ఇంటిపట్టున ఉండనందున పాపం ఆయన గారికి టీ ఇచ్చే వారు ఉండరు,
పని మనిషే టీ ఇస్తూఉంటుంది వెనక దయనీయమైన మ్యూసిక్.
తన బ్రష్ పై పేస్టు తనే వేసుకుంటూ ఉంటాడు పాపం అభాగ్యుడు!
మొహం కడుక్కున్నాక టవల్ ఇచ్చేవారుండరు అష్ట కష్టాలూ పడుతుంటాడు!
కాళ్ళు పట్టడానికి భార్య ఉండదు, ముందటి కాళ్ళు పట్టే సీన్‌ గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక మ్యూసిక్!
భోజనాల బల్ల దగ్గర కూర్చుంటే పనిమనిషి వడ్డిస్తూ ఉంటుంది, మళ్ళీ భార్య వడ్డించే సీన్‌ గురొస్తూ ఉంటే క్లోజప్ లో అతడి మొహం లో పెను విషాదం, వెనుక హృదయాన్ని పిండేసే సంగీతం!

ఇక అక్కడ అన్న గారి సంసారం హాయిగా గడచిపోతూ ఉంటుంది! మతిలేక హీరోయిన్‌ కేమీ తెలియదు. చీరకట్టుకోవటం పైటేసుకోటం కుడా తెలియదు.
హాయిగా అలా గడచిపోతూ ఉంటే ఆమె కి బిడ్డ పుడుతుంది. బిడ్డకి పాలివ్వటం కూడా తెలియని ఆమె ఓ గుళ్ళో పక్కన ఏడిచే బిడ్డని పెట్టుకు కూర్చొనుంటుంది. అప్పుడు దేవత (నిజ్జం ఒట్టూ!!!) వచ్చి పాలివ్వడం ఎలాగో నేర్పి వెళుతుంది!

వెంటనే ఈ హీరోయిన్‌ మామూలు గా మారిపోయి పెద్ద బొట్టూ, బుజాల చుట్టూ చుట్టుకున్న కొంగు తో బిందె పట్టుకుని నీళ్ళకెళుతూ ఉంటుంది! ఎంతో అవేశం తో ఆడవాళ్ళకందరికి ఎలా నీతితో మసలుకోవాలో చెపుతూ ఉంటుంది, మూర్ఖంగా కాకుండా ఆదర్శం గా ఉండాలంటుంది!!!?
విలన్లని చెంపల పై కొడుతూ, చెడ్డవారిని చెడామడా తిడుతూ ఉంటుంది.
పాతివ్రత్య నియమాలని, ధర్మాలనీ అడిగిన వారికీ అడగని వారికీ నేర్పుతూ, భర్త కి సేవలు(కాళ్ళు పట్టడం, నీళ్ళు పోయడం లాంటివి) చేస్తూ , చీదరించుకునే అత్తని దేవతలా భావించి సేవలు చేస్తూ... ఇంట్లో, పొలం లో పనిచేస్తూ, ఓ స్త్రీ ఎలా నడచుకోవాలో గుక్క తిరక్కుండా క్లోజప్ లో డవిలాగులు చెపుతూ… అలా… అలా… అలాఆ….

అక్కడ ఆ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఆఫీసు లోని వారంతా వేదిస్తూ ఉంటారు!

ఇక్కడింకో స్టోరీ ఈ అన్నా తమ్ముళ్ళకి ఓ చెల్లి ఉంది. ఆమె ని ప్రేమించి?! కడుపొచ్చాక చానా డబ్బులు తెస్తేనే పెళ్ళిచేసుకుంటానంటాడు ఒకడు!
అప్పుడు తల్లి కొడుకు లిద్దరినీ డబ్బు అడుగుతుంది.
(ఉద్యోగం చేసే) సొంత చిన్న కోడలేమో అత్తని నానా మాటలని తరిమేస్తుంది.
ఈ ( సవతి) పెద్ద కొడుకూ కోడలూ ఆమెని ఆదరిస్తారు. మేం కూలి చేసుకుని జీవిస్తాం నా పొలం తీసుకోమని హీరోయిన్‌ తన పొలాన్ని అమ్మి డబ్బు అత్తకిస్తుంది.


ఆ డబ్బుతీసుకుని మోసం చేసి, ఆ అబ్బాయికి వేరే పెళ్ళి జరిపిస్తూ ఉంటాడు అతడి తండ్రి.
మన హీరోయిన్‌ వీరావేశం తో అక్కడికి పోయి అందరి చెంపలూ వాయించి అక్కడి పెళ్ళి కూతురికి స్త్రీల గురించి పది నిమిషాల డైలాగ్ చెప్పేస్తుంది. ఆ దెబ్బకి పెళ్ళి కూతురు తాళి తెంపి పడేసి పారిపోతుంది.
మళ్ళీ అక్కడున్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఐదేసి నిమిషాల డైలాగ్ చెప్పేస్తుంది హీరోయిన్‌ నీతి, న్యాయం, సమాజం, ఆడది, వివాహం, మగవాడు, పాతివ్రత్యం, నామొహం ఇలా అన్నింటి గురించీ నిర్వచనాలు ఇచ్చినా బుద్దిరాని ఆ పె. కొ. తండ్రి గూండాలని హీరోయిన్‌ పైకి తోలతాడు. ఈమె వారితో హోరాహోరీ పోరాడుతుంది( పవిట చుట్ట తొలగకుండా ఓచేత్తో పట్టూకునే).
కాసేపటికి ఆమె తల పగిలి పక్కనే ఉన్న కాళికా మాత విగ్రహం పాదాల పై పడిపోతుంది.

అప్పుడే…. అక్కడి విగ్రహం లోంచి ఓ దేవత శూలం పట్టుకుని వచ్చి డ్యాన్సాడి అందరినీ కసా పిసా పొడచి చంపేస్తుంది!
మన మంచి వాళ్ళంతా నిద్రలోంచి లేచినట్టు ఒక్క గాయం లేకుండా లేచి నిలుచుంటారు. అప్పుడు దేవత వారితో మట్లాడి మాయమైపోతుంది! ఆ పె.కొ. కి వీళ్ళ అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తారు.
( అసలు ఈ సినిమాలో దేవత రెండు సార్లు ఎందుకొచ్చిందో నా కిప్పటికీ అర్ధం కాలే! పోనీ ఆ హీరోయిన్‌ పిలవను కూడా పిలవలా, భక్తురాలూ కాదు!!)

ఇంక ఇప్పుడు అసలు క్లైమాక్స్ అక్కడ ఉద్యోగం చేసే అమ్మాయి ని ఆమె ఆఫీసు లో వాళ్ళంతా కలిసి రేప్ చేయబోతూ ఉంటారు!!!!?
అప్పుడు అన్నా తమ్ముడూ కలిసి ఎక్కడినుంచో ఒక్క సారిగా ఎగిరి దూకి డిష్ష్యూం.. డిష్యూం.. అంటూ ఆ ఆఫీసు కోలిగ్స్ అందరినీ తన్ని ఆమెని రక్షిస్తారు. అప్పుడే మన హీరోయిన్‌ వచ్చి చెల్లీ అంటూ ఆమెని ఓదార్చి ఆడదాని కర్తవ్యాలు సంసారలక్షణాలు, ఇంకా చాలా చాలా బోధిస్తుంది. అప్పుడు అక్కా చెల్లీ కలిసి పవిత్రంగా వారి భర్తల కాళ్ళకి మొక్కి. మనకు విముక్తి కలిగిస్తారు.

18 comments:

Kathi Mahesh Kumar said...

మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాకపోతే చాలా అక్షరదోషాలు ఉండటం వలన సగం చదివేసరికీ చాలా కష్టంగా అనిపించి చదవడం మానేసాను.

దయచేసి ఆ ముద్రారాక్షసాల్ని కనుక అరికట్టగలిగితే, చదివి మరీ కామెంటడానికి ఆస్కారముంది.

Kottapali said...

మీకిది ధర్మమా? మీరు మీ ఓపికని పరీక్షించుకోవాలని ఏదో శపథం పట్టి ఆ సినిమా ఆద్యంతం చూసినంత మాత్రాన, ఇప్పుడు మాకు ఆ స్టోరీ వోలు మొత్తం చెప్పెయ్యాలా?

ఒకటి కచ్చితంగా ఏకీభవిస్తాను. మేకసందేశం, బొందభైరవి లాంటి సినిమాల్లో స్త్రీ పాత్రల చిత్రణ దారుణాతిదారుణం

Srividya said...

మొత్తానికి మీరు చూడటమే కాక మాకూ మొత్తం సినిమా చూపించేసారు. బాగా రాసారు.నాకూ పొడుగు పొడుగు సెంటిమెంట్ డైలాగులున్న సినిమాలంటే బోల్డు భయం.

సుజాత వేల్పూరి said...

రమ్య గారు,
ఆ సినిమా పేరు అదా! నేను సగంలో పెట్టాను. జయచిత్ర పెళ్ళిలో తలంబ్రాలు తినే సినిమాయేగా! మాటి మాటికీ పిచ్చి హీరోయిన్ కి హీరో పైట వేస్తోంటే అదేదో శృంగార సీను అనుకుని చూసే ఓపిక లేక కాసేపు చూసి కట్టేశా! నిజంగా మీ ఓపిక కు జోహార్లు. అంత సేపూ భరించడం ఒకెత్తూ, చూసిందాన్ని రాయడం(రాసేప్పుడు మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చుకోవాలిగా) ఒకెత్తూ!

సెభాష్! మీ ఎనర్జీ లెవెల్స్ కి!

సింధు భైరవి సినిమా చిన్నప్పుడు చూళ్ళేదు. ఈ మధ్య టివి లో వచ్చినపుడు, అందులో ఆడ పాత్రలు రెండూ చూసాక వాంతి వచ్చినంత పనైంది. మేఘ సందేశం కూడా! చీ అనిపించింది.ఆ హీరో లు ఉదాత్త పాత్రలుగా ఎందుకు కనపడాలో అర్థం కాలేదు.

Bolloju Baba said...

మీరు చూపించిన సినిమా కధ సుమారు ఓ 200 సంవత్సరాల క్రితం వ్రాసిన కధ అయిఉంటుంది.
ఇప్పటి కాలమాన పరిస్థితులకు సరిపడదు. ఆ విషయాన్ని చాలా వ్యంగంగా, సూటి గా చెప్పారు. మీ టపా బాగుంది. మీరు చెప్పిన మేఘసందేశం, సింధు భైరవి సినిమాలలో స్త్రీ పాత్రలు వ్యక్తిత్వం లెకుండా ఉంటాయి.

కానీ ఆ సినిమాలలోని సాహిత్యం, సంగీతాలకు పేరు పెట్టలేము.
సింధుభైరవి చిత్రానికి ఇళయరాజాకు జాతీయ అవార్డు వచ్చింది. మేఘ సందేశం పాటలలో కొన్ని కృ.శా వ్రాసారు.
ఈ రెంటి కోసమైనా ఆ సినిమాలు మరో సారి చూడొచ్చు.

సాహితీ యానం.

Kathi Mahesh Kumar said...

ఇప్పుడు మీ టపా చదవగలిగేలా ఉంది.

80లలో వచ్చిన కొన్నే చెప్పుకోదగ్గ చిత్రాలలో ‘మేఘసందేశం’,‘సింధుభైరవి’ వస్తాయి. ఇక మీరు చెప్పిన మూడోది "కళ్ళు తెరచిన కాళిక" మీ మాటల్లోనే ఎంత టార్చరో తెలుస్తోంది. కాకపోతే మీ శీర్షికకూ, చివరకు వచ్చిన వచ్చిన నిర్ణయానికీ పై రెండు సినిమాలూకాక మూడో సినిమా కారణంగా అనిపిస్తోంది.

ఇక తెలుగేకాక భారతీయ సినిమాలలో 60ల తరువాత స్త్రీపాత్ర చిత్రీకరణ సమాంతర చిత్రాలలో తప్ప ఎక్కడా సక్రమంగా ఉన్నట్లు కనపడవు. ఉన్నా అవి ఇంకా regressive(ఏడుపుగొట్టు) గా ఉంటాయే తప్ప నిజానికి దగ్గరగా కావు. ఇప్పుడున్న TV సీరియళ్ళు ఈ స్థితికి పరాకాష్ట.

మీరు ఈ క్రింది లంకెని చూడగలరు. http://navatarangam.com/?p=507

ramya said...

మహేష్ గారు థాంక్యు సరిదిద్దాను:)
కొత్తపాళీ గారు బాధ ని పంచుకుంటే తగ్గుతుందని అంటారుగా:) పంతం పట్టి చూడనైతే చూసా గాని అవి జీర్ణమవడమే కష్టం గా ఉంది.
శ్రీవిధ్య గారు నాకూ భయమే, అలాటివి చూడక చాలా మిస్సయి నట్టున్నాం:)
సుజాత గారు గొప్ప చిత్రాన్ని మిస్సయ్యారు:) మళ్ళీ ఎపూడైనా వేస్తారు మన టివి వారు, అప్పుడు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి:)
బొల్లోజుబాబా గారు మీరన్నది నిజం, పాటలు బావుంటాయ్.

ramya said...

మహేష్ గారు,
సింధు భైరవి, మేఘసందేశం కళ్ళుతెరిచిన కాళిక అనుభూతే కలిగించాయి నాకు.

హీరో గొప్ప విద్వాంసుడు,కవి పెళ్ళాం కాకుండా వేరే అమ్మాయి పై మనసు పడతాడు. ఊరికే పిచ్చివాడు, తాగుబోతు ఐపోయే బలహీన మనస్కుడు. ఇలాంటి కథ ని స్త్రీ నీతి చెడకుండా చూపాలి , అదే సమయం లో హీరో ని ఉన్నతుడుగా చూపాలి, సమాజం బేష్ అనేలా చూపాలి ఎలా గంటే ఇలా..

ఒక సినిమా లో ఏ గొడవా లేకుండా(నీతిచెడకుండా!) భోగం అమ్మాయి పాత్ర పెట్టేస్తారు. ఆ హీరో ఆమె పై మనసు పడి, భార్యనీ ఉద్దరించాలనే అనుకుంటాడు. ఆయన్ని అక్కడ ఆ అమ్మాయి, ఇక్కడ భార్య పూజిస్తూనే ఉంటారు, అతని కోసమే వారి జీవితం.

ఇంకో సినిమా లో హీరో గారు మనసు పారేసుకున్న అమ్మాయిదగ్గరకెళ్ళి తన భర్తని బాగుచేసి తనకు పతి బిక్ష పెట్టమని అడిగి, బాగయ్యాక ఆ పిల్లని భర్తకిచ్చి పెళ్ళి చేసి ముగ్గురూ కలిసుండాలనీ ఉబలాట పడిపోతుంది ఆ పతివ్రత. హీరో గారు ఆశగా చూస్తూ ఉంటారు(లోలోన కుములుతారు). ఆ ప్రియురాలేమో హీరో కి తనకి పుట్టిన బిడ్డ ని వారికి త్యాగం చేసి అలా నడచెళ్ళి పోతుంది.
ఈ రెండు సినిమాల్లో ఏ పాత్ర వ్యక్తిత్వమూ నాకు నచ్చలేదు. మార్కులంటూ వేయాల్సివస్తే ఆ భోగం డ్యాన్సర్ అమ్మాయికి కాసిన్ని వేయొచ్చు.
ఒక కవి, లేద విద్యాంసుని కథ ( సినిమాని) ఇంతకంటే మెరుగ్గా ఊహించలేమా!

Kathi Mahesh Kumar said...

రమ్య గారూ, ఫిల్మ్ క్రిటిసిజం భాషలో "Male Gage" అనే ఒక పదం ఉంది. సులువుగా చెప్పాలంటే మగదృష్టి లేక దృక్కోణం అనుకోవచ్చు. మన సినిమాల సమస్య చాలా వరకూ అదే. సినిమా తీసేవాళ్ళు చాలా వరకూ మగాళ్ళుకావడం, చూసేవాళ్ళలో చాలామందికి (ఆడవాళ్ళలో కూడా ఈ మేల్గేజ్ ఉంటుందండోయ్!) ఈ దృక్కోణం ఉండటంతో, వారు ఎలా expect చేస్తారో, పాత్రలూ కథలూ అలాగా సృష్టించబడతాయి. ఈ "గేజ్" ను చాలా వరకూ సమాజం condition చేస్తే, వాటిని నవలల రూపంలో అక్షరబద్ధం చేసారు. వాటినే ప్రాతిపదికగా తీసుకుని సినిమాలలో దృశ్య బద్దం చెయ్యబడుతున్నాయి.

ఇంకా విపులంగా కావాలంటే చెప్పండి. ఏకంగా ఈ విషయం మీద ఒక టపానే రాసేద్దాం !

Rajendra Devarapalli said...

రమ్య గారు,మొదట మీఓపికను మెచ్చుకోవాలండి.మీరు రాసినకధ బహుశా కదలివచ్చిన కనకదుర్గ అనుకుంటాను.కధాక్రమం అలా ఉంది.నేను చూడలేదనుకోండి.నాకనుమానం ఆసినిమా సూపర్డూపర్ హిట్టనుకుంటా.తల్లిదీవెన అనే ఒక తుపాకి సినిమా మా ఊర్లో కొన్ని వందలరోజులాడింది.వైజాగులో చేతబడి అనే సినిమా 560 వ రోజు వాల్పోస్టరు నేను చూసాను,తర్వాత ఎన్ని రోజులాడిందో నాకు తెలియదు.అలాగే శివజలంధరయుద్ధం వగైరాలు,కొన్ని సినిమాలు అంతే.
ముక్కు నటి సుహాసినికి మంచిపేరు వచ్చిన సింధుభైరవి(ముక్కు నటి ఎందుకంటే ఆమె హావభావాలన్నీ ముక్కు మీదో,ముక్కు చివరో పలికిస్తుంది,రేవతి మూతి తో,ఆర్.నారాయణమూర్తి మొహం ఒక్కదానితో నటిస్తున్నట్లు).ఆ సినిమా తీయటం లో బాలచందర్ ముఖ్య ఉద్దేశ్యం కళాకారులకూ మానవసహజ బలహీనతలుంటాయని,వాటికి పంచింగ్ బ్యాగులుగా ఆడవారు ఉపకరిస్తున్నారు అన్నది అని నాభావన.తమిళనాట శాస్త్రీయసంగీతవిద్వాంసులు ఎక్కువ,రుద్రవీణలో కూడా బాలచందర్ ఒక శాస్త్రీయసంగీతవిద్వాంసుడి పాత్రద్వారా కూడా స్వంతకొడుకు మీది రాగద్వేషాలు చూపుతారు.అసలు బాలచందర్ సినిమాల్లోని స్త్రీపాత్రలమీద ఒక థీసిస్ రాయొచ్చండి.

ఇక మేఘసందేశం సినిమా జమీందారీ యుగం లోని బెంగాలు ప్రాంతాల్లోతీరిగ్గాతిని కాస్త చదువు,సంగీతం మీద అభిరుచి,కూతంత కలాపోసన,భార్యకి తనలాగా కళాహృదయం లెకపోయెనే అని వగస్తూ,కాస్త సభ్యత ఉన్న ఒక వారాంగన వద్ద ఓదార్పు పొందే పాత్రలతో కూడిన రచనలు ఆనాడు కోకొల్లలు.సదరు సినిమా కూడా అలాంటి ఒకానొక నవలా ప్రేరిరతమై ఉండొచ్చు.అందులో కధానాయకుడి పేరు కూడా రవీంద్రుడు.పేద్ద ఇంకుపెన్నులతో కవితలు రాస్తూ ఉంటాడు.కధాసౌలభ్యం కోసం గోదారొడ్డున చిత్ర్రీకరించారు.అందులో అంటే అలాంటి కధ ఉన్న చిత్రాల్లో స్త్రీపాత్రధారులు ఇంకెలా ఉంటారు మన అమాయకత్వం కాకపోతే!!??.
కామెంటు మరీ పొడుగయ్యిందని కాస్త కత్తెరేశా..

కొత్త పాళీ said...

kathi .. you mean male "gaze".
of course .. male "gage" is possible too :-)

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళి, హమ్మో! నా టైపు/స్పెల్లింగు తప్పులో చాలా తీవ్రమైన కోణం జోడించారండీ మీ pun తో.
నెనర్లు.

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర కుమార్ గారు,
అమ్మయ్య, సుహాసిని ముక్కుతో హావభావాలు పలికిస్తుందని భావించేవారిలో నేను కాక మీరూ ఉన్నారన్నమాట! ఈ మాటంటే అందరూ దెబ్బలాడతారు...నవ్వు అనే పదార్థం సుహాసినితోనే పుట్టిందని వాదిస్తారు!

'నారాయణ మూర్తి మొహం ఒక్కదానితోనే నటిస్తున్నట్టు...' టాప్!

అన్నట్టు రమ్య గారు రాసిన సినిమా పేరు కరక్టే! కదలి వచ్చిన కనక దుర్గ సినిమా వేరు! ఈ నుంచే అమ్మవారు బుల్లి లంగా జాకెట్టు వేసుకుని చిన్న పిల్ల రూపం లో రావడం మొదలైందనుకుంటా! ఆ తర్వాత టివి సీరియల్స్ కూడా ఇదే వేషం వేసుకొస్తోంది ఆవిడ!

ramya said...

మహేష్ గారు మీరన్న ఆ మేల్గేజ్ ( ప్రతి ఒక్కరి లో తెలిసో తెలియకొ) ఉంటుందేమో అనిపిస్తుంది. సమాజం వల్ల నవలలు, నవలల ద్వార సినిమాలు.. మళ్ళీ ఆ రంగులద్దిన సినిమాల ద్వార సమాజం తయారయి పోతుంది.(అలాంటి సినిమాలలోని పాత్ర లాంటి ఆంటీలు నాకు తెలిసిన వారు ఉన్నారు:) వాళ్ళు అలాంటి సినిమాల వల్లే అలా తయారయ్యారనిపిస్తుంది)(అంతెందుకు కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ తింగరి గా ఊతపదం తో మాట్లాడతారు అవి చూసి బయట అలాగే మాట్లాడే అమాయకపు అమ్మాయిలనూ చూసా!)
విపులంగా తప్పక టపా రాయండి నేను మీపోస్ట్ కై ఎదురుచూస్తూ ఉంటా.

ramya said...

రాజేంద్రగారు 'నారాయణ మూర్తి మొహం ఒక్కదానితోనే నటిస్తున్నట్టు...హ హ హ బావుంది.
మీరు చెప్పే సంగతులు చాలా ఆసక్తిగా ఉన్నాయి(మీరుచెప్పిన సినిమాలు ఉన్నాయనే తెలియదు నాకు:(
వీటి గురించి ఓ పోస్ట్ కొట్టకూడదు?

సుజాత గారు,బొల్లోజు బాబా గారు రాసింది చూసాక ఆలోచిస్తే నిజంగా ఈ కథ 200 ఏళ్ళ నాటిదేనని నాకనిపిస్తూఉంది. పాత జానపద కథలు గుర్తుతెచ్చుకోండి ఒకసారి , చెడ్డ వారు మంచి వారు అప్పుడప్పుడు దేవత వచ్చి కష్టాలు తీరుస్తూ..
కాక పోతే ఆ కథ ని కాస్త మార్చి స్త్రీ ల కోసం తీసినట్టున్నారు, దాన్ని మన టీవీ వారు ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ మనల్ని ఆనందింప జేస్తున్నారు:)

Rajendra Devarapalli said...

ధన్యవాదాలు సుజాత గారు,రచయిత్రి రమ్య గారు,
ఈమధ్య బ్లాగు ప్రపంచం లో సంభవిస్తున్న కొన్ని పరిణామాలు చూస్తూ చాలా డిస్టర్బ్ అయ్యానండి,వీటి పర్య్వసానాలగురించి ఆలోచిస్తూ ఇంకాస్త కలతచెందుతున్నా ఇక పోస్టులు ఏమిరాస్తాను.
అది అలా పక్కన పెడితే...చాన్నాళ్ళ క్రితం కన్నడనాడు నుండి రామకృష్ణ హెగ్డే అని ఒకనటవస్తాదు ను మనవాళ్ళు పట్టుకొచ్చారు.ఆయన హావభావాలకు ఎలాంటి విశేషణం తగిలించాలో అర్ధంకాక ,"మొహాన కత్తివేటుకు కూడా ఫీలింగు ఇవ్వలేకపోతున్నాడు "అని సరి పెట్టుకున్నారు.ఆతర్వాత కొన్నాళ్ళకు తమిళసీమనుండి అరుణ్ పాండ్యన్ అని మరో నటభీబత్సుడిని తెచ్చారు.ఇక ఈయనను ఏంవర్ణ్మిస్తామురా చిన్నయసూరీ అని తలలు పట్టుకుని కూర్చున్న మన వాళ్ళకు మెరుపులా ఒక అవిడియా వచ్చి "పిడుగు నెత్తినపడ్డా ఫీలింగులు రానివాడని సర్దుకుపోయారు.అఫ్ కోర్స్ ఆనాటి మగధీరులంతా ముంబాయి హీరోయిన్లుగా మనకు మళ్ళీ కనువిందు చేస్తున్నారనుకొండి.
సాధ్యమైనంతవరకూ తెలుగుతెర దగ్గరకు వెళ్ళకూడదండి.ఒకవేళ వెళ్ళినా ఇక్కద ఉమ్మి వేయుము అని ఇసక బొక్కెనలు కనిపిస్తాయి,అయినా తప్పదనుకోండి.చూద్దాం,ఒక టపా గెలుకుతానేమో త్వరలో!?

చదువరి said...

హహ్హహ్హ..రాజేంద్ర గారూ, ఆర్నారాయణమూర్తి నటన గురించి గొప్పగా చెప్పారండి. దాన్నెలా వర్ణించాలో తెలిసేది కాదు. "మొహంతో మాత్రమే నటిస్తాడు" - ఇది భలే బాగా సరిపోతుంది. సుహాసిని గురించి కూడా బాగా చెప్పారు.

ramya said...

రాజేంద్రగారు, మా ఇంటిపేరు 'రచయిత్రి' కాదండి.