స్త్రీలు -సినేమాలు

1:09 PM at 1:09 PM

మరీ పాతవి కొన్ని క్లాసిక్స్ అని చెప్పబడేవి చూసా, కొత్త సినిమాలు అంటే ఓ పదేళ్ళ లోపువి కొన్ని చూసాను. వాటి మధ్యలో వచ్చిన చాలా సినిమాలు నేను చూడనివే!
ఈ విషయం లో నాలెడ్జ్ మరీ పూర్ గా ఉందని.. టి వి లో వచ్చే అప్పటి సినిమాలు చూసేయాలని చానాళ్ళకిందే డిసైడయ్యా గాని అమలు పరిచే ధైర్యమే లేకపోయింది!

ఈ మధ్య రాజకీయ వార్తలు చూసీ, వినీ కూడా స్థిరంగా ఉన్నానంటే నా ఓపిక స్థాయి బానే పెరిగి పోయిందని నాకెందుకో ఓ గొప్ప నమ్మకం కలిగింది! ఇంకేం వీలుదొరికినప్పుడంతా ఆ సినేమాలు చూసేస్తే సరి! పోయేదేముంది అనుకున్నా!

అలా మొన్నో రోజు రెండు చానల్లో వచ్చే రెండు చిత్రరాజములను ఒకే సారి చూసేసా, మొత్తానికి!
ఓ దాంట్లో "మేఘసందేశం" నా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టమైన పాటలవటం వల్ల ఆ కేసెట్ తరచుగానే మోగుతుండేది. శానా గొప్ప సినెమా అని మనసులో ముద్రకూడా పడిపోయుండె!!

పాటల సంగతి పక్కన పెడితే. నా కైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు. నువ్వే సినిమా పూర్తిగా చూసావు గనక!! ఇదేనా నీ పెరిగిపోయిన ఓపిక?? అనే నా హృదయ గోస విని సరె ఈ మధ్య టీవీ న్యూసే మన ఆరోగ్యాన్ని ఏమీ చేయలేక పోయింది ఇదో లెఖ్ఖా! చూసే తీరదాం అనకునేసిన.

దీంతో బాటు మరొకటి బాలచందర్ ది సింధు భైరవి దాని పేరు.(తమిళ్ డబ్బింగు, ఈ సినిమా కి పొడిగింపు గా శహానా అనే సీరియల్ వచ్చిందామధ్య. ప్చ్ నేను చూడలే)
రెండూ మంచి సంగీతం, పాటలు కలిగిన పేరుకెక్కిన సినిమాలే .. కాని నాకు చిరాకునే మిగిల్చాయి. ( కథ వేరైనా ఈ రెండు సినిమాలూ ఒక్క కుదురు లోని మొక్కలే ననిపించింది).


స్త్రీల స్థాయి ని దిగజార్చటానికి అప్పట్లోని సినిమాలు గొప్ప కృషే చేసినట్టున్నాయి, మొన్నటికి మొన్న యధాలాపంగా ఓ సినిమా చూసా అదేంటో "కళ్ళు తెరిచిన కాళికో" ఏదో ఉంది పేరు, మాంచి మహిళా చిత్రం!

దాంట్లో ఇద్దరన్నాతమ్ముళ్ళు . అన్న మంచివాడు?! వ్యవసాయం చేస్తాడు(ఇతనికి సవతి తల్లన్నమాట),
తమ్మున్నేమో తల్లి పెద్దచదువులు చదివిస్తుంది.
ఇంక ఇటు అన్న సంసారం, అటు తమ్ముడి సంసారం మార్చి, మార్చి దర్శింపజేస్తూ ఉంటాడు దర్శకుడు.

ఓ పిచ్చి (జయచిత్రనుకుంటా ఆమె పేరు ) అమ్మాయి(ఆంటీ) ని పెళ్ళి చేసుకుంటాడు అన్న.

అక్కడ ఓ పెద్ద చదువులు చదివిన పెద్దింటి అమ్మాయిని చేసుకుంటాడు తమ్ముడు.

ఈ పిచ్చామ్మాయి ముగుడబ్బాయ్, మొగుడబ్బాయ్ అంటూ ముగుడ్ని ప్రేమిస్తూ ఉంటుంది, ఒంటిమీద సృహ ఉండదు.

ఆ పెద్దింటి అమ్మాయి మొగుడిని ఖరీదైన వస్తువులు తెమ్మని వెదిస్తూ ఉంటుంది. తెచ్చీ తెచ్చీ ఇక నా వల్ల కాదంటాడు. ఐతే నేనే ఉద్యోగం చేసి సంపాదిస్తా నని ఉద్యోగానికి వెళుతుంది.

ఆమె సరిగ్గా ఇంటిపట్టున ఉండనందున పాపం ఆయన గారికి టీ ఇచ్చే వారు ఉండరు,
పని మనిషే టీ ఇస్తూఉంటుంది వెనక దయనీయమైన మ్యూసిక్.
తన బ్రష్ పై పేస్టు తనే వేసుకుంటూ ఉంటాడు పాపం అభాగ్యుడు!
మొహం కడుక్కున్నాక టవల్ ఇచ్చేవారుండరు అష్ట కష్టాలూ పడుతుంటాడు!
కాళ్ళు పట్టడానికి భార్య ఉండదు, ముందటి కాళ్ళు పట్టే సీన్‌ గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక మ్యూసిక్!
భోజనాల బల్ల దగ్గర కూర్చుంటే పనిమనిషి వడ్డిస్తూ ఉంటుంది, మళ్ళీ భార్య వడ్డించే సీన్‌ గురొస్తూ ఉంటే క్లోజప్ లో అతడి మొహం లో పెను విషాదం, వెనుక హృదయాన్ని పిండేసే సంగీతం!

ఇక అక్కడ అన్న గారి సంసారం హాయిగా గడచిపోతూ ఉంటుంది! మతిలేక హీరోయిన్‌ కేమీ తెలియదు. చీరకట్టుకోవటం పైటేసుకోటం కుడా తెలియదు.
హాయిగా అలా గడచిపోతూ ఉంటే ఆమె కి బిడ్డ పుడుతుంది. బిడ్డకి పాలివ్వటం కూడా తెలియని ఆమె ఓ గుళ్ళో పక్కన ఏడిచే బిడ్డని పెట్టుకు కూర్చొనుంటుంది. అప్పుడు దేవత (నిజ్జం ఒట్టూ!!!) వచ్చి పాలివ్వడం ఎలాగో నేర్పి వెళుతుంది!

వెంటనే ఈ హీరోయిన్‌ మామూలు గా మారిపోయి పెద్ద బొట్టూ, బుజాల చుట్టూ చుట్టుకున్న కొంగు తో బిందె పట్టుకుని నీళ్ళకెళుతూ ఉంటుంది! ఎంతో అవేశం తో ఆడవాళ్ళకందరికి ఎలా నీతితో మసలుకోవాలో చెపుతూ ఉంటుంది, మూర్ఖంగా కాకుండా ఆదర్శం గా ఉండాలంటుంది!!!?
విలన్లని చెంపల పై కొడుతూ, చెడ్డవారిని చెడామడా తిడుతూ ఉంటుంది.
పాతివ్రత్య నియమాలని, ధర్మాలనీ అడిగిన వారికీ అడగని వారికీ నేర్పుతూ, భర్త కి సేవలు(కాళ్ళు పట్టడం, నీళ్ళు పోయడం లాంటివి) చేస్తూ , చీదరించుకునే అత్తని దేవతలా భావించి సేవలు చేస్తూ... ఇంట్లో, పొలం లో పనిచేస్తూ, ఓ స్త్రీ ఎలా నడచుకోవాలో గుక్క తిరక్కుండా క్లోజప్ లో డవిలాగులు చెపుతూ… అలా… అలా… అలాఆ….

అక్కడ ఆ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఆఫీసు లోని వారంతా వేదిస్తూ ఉంటారు!

ఇక్కడింకో స్టోరీ ఈ అన్నా తమ్ముళ్ళకి ఓ చెల్లి ఉంది. ఆమె ని ప్రేమించి?! కడుపొచ్చాక చానా డబ్బులు తెస్తేనే పెళ్ళిచేసుకుంటానంటాడు ఒకడు!
అప్పుడు తల్లి కొడుకు లిద్దరినీ డబ్బు అడుగుతుంది.
(ఉద్యోగం చేసే) సొంత చిన్న కోడలేమో అత్తని నానా మాటలని తరిమేస్తుంది.
ఈ ( సవతి) పెద్ద కొడుకూ కోడలూ ఆమెని ఆదరిస్తారు. మేం కూలి చేసుకుని జీవిస్తాం నా పొలం తీసుకోమని హీరోయిన్‌ తన పొలాన్ని అమ్మి డబ్బు అత్తకిస్తుంది.


ఆ డబ్బుతీసుకుని మోసం చేసి, ఆ అబ్బాయికి వేరే పెళ్ళి జరిపిస్తూ ఉంటాడు అతడి తండ్రి.
మన హీరోయిన్‌ వీరావేశం తో అక్కడికి పోయి అందరి చెంపలూ వాయించి అక్కడి పెళ్ళి కూతురికి స్త్రీల గురించి పది నిమిషాల డైలాగ్ చెప్పేస్తుంది. ఆ దెబ్బకి పెళ్ళి కూతురు తాళి తెంపి పడేసి పారిపోతుంది.
మళ్ళీ అక్కడున్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఐదేసి నిమిషాల డైలాగ్ చెప్పేస్తుంది హీరోయిన్‌ నీతి, న్యాయం, సమాజం, ఆడది, వివాహం, మగవాడు, పాతివ్రత్యం, నామొహం ఇలా అన్నింటి గురించీ నిర్వచనాలు ఇచ్చినా బుద్దిరాని ఆ పె. కొ. తండ్రి గూండాలని హీరోయిన్‌ పైకి తోలతాడు. ఈమె వారితో హోరాహోరీ పోరాడుతుంది( పవిట చుట్ట తొలగకుండా ఓచేత్తో పట్టూకునే).
కాసేపటికి ఆమె తల పగిలి పక్కనే ఉన్న కాళికా మాత విగ్రహం పాదాల పై పడిపోతుంది.

అప్పుడే…. అక్కడి విగ్రహం లోంచి ఓ దేవత శూలం పట్టుకుని వచ్చి డ్యాన్సాడి అందరినీ కసా పిసా పొడచి చంపేస్తుంది!
మన మంచి వాళ్ళంతా నిద్రలోంచి లేచినట్టు ఒక్క గాయం లేకుండా లేచి నిలుచుంటారు. అప్పుడు దేవత వారితో మట్లాడి మాయమైపోతుంది! ఆ పె.కొ. కి వీళ్ళ అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తారు.
( అసలు ఈ సినిమాలో దేవత రెండు సార్లు ఎందుకొచ్చిందో నా కిప్పటికీ అర్ధం కాలే! పోనీ ఆ హీరోయిన్‌ పిలవను కూడా పిలవలా, భక్తురాలూ కాదు!!)

ఇంక ఇప్పుడు అసలు క్లైమాక్స్ అక్కడ ఉద్యోగం చేసే అమ్మాయి ని ఆమె ఆఫీసు లో వాళ్ళంతా కలిసి రేప్ చేయబోతూ ఉంటారు!!!!?
అప్పుడు అన్నా తమ్ముడూ కలిసి ఎక్కడినుంచో ఒక్క సారిగా ఎగిరి దూకి డిష్ష్యూం.. డిష్యూం.. అంటూ ఆ ఆఫీసు కోలిగ్స్ అందరినీ తన్ని ఆమెని రక్షిస్తారు. అప్పుడే మన హీరోయిన్‌ వచ్చి చెల్లీ అంటూ ఆమెని ఓదార్చి ఆడదాని కర్తవ్యాలు సంసారలక్షణాలు, ఇంకా చాలా చాలా బోధిస్తుంది. అప్పుడు అక్కా చెల్లీ కలిసి పవిత్రంగా వారి భర్తల కాళ్ళకి మొక్కి. మనకు విముక్తి కలిగిస్తారు.

నా చేతి వంట

9:59 PM at 9:59 PM

ఈ రోజు ఉదయం పడక పైనుండి లేవగానే ఏంటో చుట్టూ అంతా తేడాగా అనిపించింది! కాసేపట్లోనే ఆ తేడా నాలోనేనని అర్ధమైంది. నిన్న అర్ధరాత్రి దాటేదాకా ఒకరి బ్రెయిన్‌ తింటూ బానేఉన్నా. ఇదేంటో తెల్లారేసరికి పుట్టెడు జలుబు,ఒళ్ళు నొప్పులు. ఎందుకొచ్చిదో నని ఆలోచిస్తే అర్ధరాత్రి తిన్న కీరా గుర్తొచ్చింది. అర్ధరాత్రులు ఆకలేస్తే కీరా దోస తినకూడదన్న సంగతి తెలుసుకున్నా!

ఒంట్లో బాగోక పోతే ఒంటరైపోతాం. ముఖ్యంగా మనలాంటి బ్రెయిన్‌ ఈటర్స్ కి కావలిసింది గొంతే అది పూడుకు పోయింది ఈ మాయదారి జలుబుతో, ఇంకేం.. వేటాడలేని ముసలి పులిలా ఒంటరినైపోయా. తినడానికి బ్రెయిన్‌ అంత గాక పోయినా అలాంటి రుచికరమైనదేమన్నా చేద్దామనుకున్నా. ఐడియా వచ్చింది, ప్రయోగం చేసేసాను. ఇదిగో నా చేతివంట.

మైక్రోఒవెన్‌ లో కజ్జి కాయలు.