బాబోయ్ బ్లాగులు

2:29 PM at 2:29 PM

ఊరికే ఉండక బ్లాగులు చదివి, వాఖ్యలు ఇచ్చి ఎరక్కపోయి ఇరుక్కుని, అడుసు తొక్కనేల కాలు......? అని చింతించి, ఊరుకున్నంత ఉత్తమం లేదనుకుని, ఇంక ఇదంతా వద్దని డిసైడైయి పోయిన సమయం లో కెవ్వు మనే బ్లాగు ఒకటి చదివి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుని (మన సినిమాల్లో తలకి దెబ్బతగిలి మతిపోయి మళ్లీ దెబ్బతగిలి మతి తిరిగొచ్చినట్టన్నమాట) బ్లాగేద్దామని మెదలెట్టా.

ఈ బ్లాగులు చదవటం మొదలెట్టాక జీవితమే మిథ్య లాగుంది, ఈ మధ్య ఓ రెండు రోజులు నా మాయా దర్పణం పనిచేయక పోయేసరికి బయటి ప్రపంచం లోపడ్డా, మెదట నన్ను స్పృహ లోకి తెచ్చింది మా పనమ్మాయె "మేడం గారండీ నిన్నా ఈ రోజు గిన్నెలు మాడ లేదండీ" అంది ఇకిలిస్తూ. నేను రోజూ ఈ మాయా దర్పణం ముందు కూర్చోబోతూ వంటగది లో కెళ్లి కాఫీనో టీనో స్టవ్ పై పడేసి (కాఫీ, టీ తాగుతూ బ్లాగులు చదవాలనే కోరిక ఇప్పటి వరకూ తీరలేదు) వచ్చి ఈ మాయదారి లోకం లో పడి ఆ గిన్నెలు మాడి పరిమళాలు వ్యాపించాక గాని ఈ లోకం లోకి రావట్లేదు మరి. పనమ్మాయి మాటలకి ఇన్ని రోజులు గా మాడిన గిన్నెల్ని చూసుకుని ఉలిక్కి పడి మా వారి దగ్గరికి పరిగెత్తుకెళ్లి నా బాధ వెలబోసు కున్నా, తను చాలా ప్రశాంతంగా
" ఆ పోతే పోనీలే కొత్తవి కొనుక్కో" అనే సరికి,
పోయి పోయి ఈయనకి చెప్పుకున్నా చూడు అని (దేనికీ చెలించని ఆయన్ని చూస్తూ) నన్ను నేను తిట్టుకుని, తీరిగ్గా కూర్చుని గడచిన రెండు నెలల గురించి ఆలొచించటం మొదలెట్టా, షాపింగ్ చేసి ఎన్ని రోజులయిపోయిందో,(మూడునెలల్లో ఒక్క డ్రెస్ కూడా కొనలేదంటే నాకది రికార్డే) ఇం ట్లో పుస్తకాలు, బయటి మొక్కలు నామీద బెంగ పెట్టేసుకున్నాయి ఇంక నేను వెళ్లకుండా వున్న శుభకార్యాలకి సమాధానం చెప్పు కోవాల్సి వుంది . ఇదివరలా వారాంతపు విందులు, వినోదాలు లేవు. ఏం సినిమాలు వచ్చాయో వెళ్లిపోయాయో తెలియదు. చేసే కాల్స్ తగ్గి ఫోన్ బిల్లు సగానికి తగ్గిపోయింది. స్నేహితులకి, చర్చలకి సమయమే లేకుండా పోయింది. ఇక చేయాల్సిన పనుల జాబితా చూస్తే చిత్రగుప్తుని చిట్టా లా అది ఓమీటరు పొడవుంది దాన్ని చూసి గుండె గుభేలు మని మళ్లీ మా వారి దగ్గరికి పరిగెత్తా నా రొదంతా తీరిగ్గా విని అతి ప్రశాంతంగా
"ఆ పోనిద్దూ దానికంత కంగారెందుకు నాల్గు రోజులైతే బోర్ కొట్టి నువ్వే దాన్ని కట్టేసి రొటీన్ లో పడతావు" అన్నాడు ఈయన సంగతి తెలిసీ మళ్లీ..... చ ఇక నేనే ఆలోచించి నా పాత ప్రపంచాన్ని ,నా సమయాన్ని రక్షించు కోవాలి అని అనుకుంటూ మళ్లీ మాయాదర్పణం ముందు కూర్చున్నా.

నేను

4:18 PM at 4:18 PM
ఆ తోటలో పూసినపుడు
నీ పాదాల చేరాలని ఆశపడ్డాను
చేరగలనో లేదోనని బెంగపడ్డాను
కాని ప్రభూ
నీ మెడలోని దండలో కూర్చుకున్నావు
నీ గుండెలపై నన్ను చేర్చుకున్నావు