పుస్తకాలు - 2

6:43 PM వద్ద 6:43 PM

మొదట్లో వాటినీ న్యూస్ పేపర్లలా అలా చదివి ఇంకోళ్ళకెవరికైనా ఇచ్చే ఓ అలవాటుండేది. ఆ వయసులో చదివిన పుస్తకం నాల్గేళ్ళు పోయాక చదివితే కొత్తగా అన్పించేది, వయసును బట్టీ ఆ కథలు కలిగించే ఆలోచన్లలో అనుభూతుల్లో తేడాకనిపించేది. మళ్ళీ ఒకసారి చదువుదాం అనుకున్నప్పుడలా మళ్ళీ కొనుక్కోవటం, కొన్ని దొరక్కపోవటం ఇవీ పుస్తకాలు పోగేయటానికి కారణాలు. ఇప్పటికీ నా దగ్గరున్న వాటికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ. ( ఎవరికన్నా ఓ పుస్తకం ఇచ్చి నాల్గురోజులు పోయాక అడిగి చూడండి అది మరొకరికి ఇచ్చాననే చెప్తారు ఎక్కువమంది)
బామ్మలో అమ్మలలో చెప్పిన చిన్ననాటి ఆ కథలే సాహిత్యభిలాషకి బీజాలై ఉంటాయి సాధారణంగా. కథలంటేనే నాకెక్కువ ఇష్టం వంద కథలున్న పుస్తకమైనా ఇష్టంగా చదవగలను గానీ నవల నాకెందుకో బోరే! యండమూరి నవలలు ఇష్టమే గానీ, ఎక్కువగా కొన్నవి కథల సంపుటాలే. కొడవటిగంటి నుండి రావూరి భరద్వాజ వరకు, చలం, గోపీచంద్ నుండి ఇప్పటి సుంకోజీ వరకు అన్నీ ఇష్టమైనవే.

కథలు కవ్విస్తాయి, నవ్విస్తాయి, కన్నీళ్ళు పెట్టిస్తాయి. కల్లోల పరుస్తాయి! మురిపించి, వెక్కిరించేవి, సేదతీర్చేవి, ఉద్వేగంతో ఊగించేవి, ఆలోచింపజేసేవి, స్పూర్తినిచ్చేవి, దారి చూపేవి. కొన్ని నిగూఢంగా, ఇంకొన్ని వంకరగా వ్యంగంగా, డొంకతిరుడుగా చెప్పేవికొన్ని, చెల్లున వీపు చరిచేవికొన్ని. కలల్లోంచి వ్యధల్లోంచి పుట్టేవి కొన్నైతే, ఆలోచనలనీ ఆవేదనలనీ పంచేవి కొన్ని. తెలియని, ఎప్పుడూ చూడని ప్రపంచాన్ని చూపేవి కొన్నైతే.....! చుట్టూ జరిగే వాటిని ప్రతిబింబింపజేసేవి కొన్ని. కథలంటే నాకిష్టంకాదు....పిచ్చి! మంచి కథ చదివితే విందారగించినంత తృప్తిగా ఉంటుందంటారు కొందరు! నేనంత భోజన ప్రియురాలిని కాదు కాబట్టి నాకైతే ఆరోజుకి భోంచేయకుండానే పొట్టనిండినట్టు ఉంటుంది నాకు.

క్లాసురూం గోల గోల ఉంది ఎన్నిసార్లు సైలెన్స్ అని టీచర్ అరచినా వినిపించుకోనట్టే ఉన్నారు పిడుగులు. మీకో కథ చెపుతా అన్నదా అంతే పిన్డ్రాప్ :) అన్నమాటే. అన్నం తినకుండా పేచీపెట్టే చంటాడు కథ మొదలెట్టగానే నోరుతెరచి వింటాడు తింటూ. ఎదన్నా పని చెపితే కుర్రాడు వినిపించుకోలేదా రాత్రికి కథ చెపుతా నని లంచంపెడితే ఆ పని ఐపోయినట్టే. ఆడుకునే పిల్లల్ని పిలిచి నీతి బోధలు చేయబోతారు తాతగారు. అబ్బా క్లాసు పీకుతున్నాడు బాబో అనుకునే పిల్లలు ఓ నీతిథల పుస్తకం చేతికిస్తే అవే బోధలు హాయిగా చదివేస్తారు.
చిన్నప్పుడు రెక్కలగుర్రంపై రాకుమారుడు వెళుతున్నాడంటే సంబరంగా దాన్నలాగే ఊహిస్తాం. పెద్దయ్యాక అది అసంబద్దమైంది అంటాం! ఏడు చేపల కథ తెలియని వాళ్ళుండరేమో, అలీబాబ, గలీవర్, అల్లాద్దీన్..ఇలా చెప్పుకుంటూపోతే అప్పుడు మనల్ని మరిపించే కథలెన్నో..... అందుకే కొన్ని కథల్ని కథల్లానే చదివితే బావుంటుందనిపిస్తుంది నాకు.
అబ్బే ఈ కథలోలా మేంలేము దిన్నసలు ఒప్పుకో అంటాం! అందరిజీవితాలూ ఒకేలా సాగితే వాటినే కథలుగా రాయాల్సిన అవసరమేముంది! నేనెప్పుడూ చదువుతున్న కథ నాకు మ్యాచ్ :) అయ్యిందా అని అనుకొని చదను. అసలెందుకు మ్యాచ్ :) అవ్వటం! ఒక్కోరికి ఒక కథ ఉంటుంది మన సంగతి కాసేపు పక్కన పెట్టి వాళ్ళ కథేమిటో వినాలనే కుతూహలం కథని మరింత ఆసక్తిగా చదివిస్తుంది. కథలు కొన్ని కల్పితాలు ఐనా వాస్తవమనే బ్రమ కలిగిస్తాయి, కొన్ని వాస్తవాలు ఐనా నమ్మశక్యం కాదు! ఏవైనా సరే ఆ కథ నన్ను తనతో ఈడ్చుకుపోయి నన్ను నేను మరచిపోయేలా చేసిందంటే....., ఆ కథలో పాత్రలతో పాటూ కలిసి ప్రయాణం చేస్తూ చివర వారితో వీడ్కోలు కష్టంగా ఉందంటే..., అంటే .....:) మరదే కథ! మనసుని కదిలించేదే నాకు మంచికథ!
చుట్టూ అందరూ ఉన్నారు బయటకి నవ్వొద్దు బ్రెయిన్ ఓ వైపు సూచనలిస్తూనే ఉంటుంది, అది ట్రైనా, బస్సా ఎక్కడున్నాం... చదువుతున్న కథలో పాత్రలు వదలకుండా పట్టి పీడిస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చేస్తుందంటే......:) మరదే కథ, మహా మంచి కథ.
చదువుతోంటే ఉద్వేగం ఊపేసిందా, కథలో పాత్రలు జీవమున్న మనుషులుగా అనుభూతి కలిగించాయంటే...., వాళ్ళు ఎక్కడో ఉన్నారని ఆ తరువాత కూడా ఎప్పుడూ అనిపిస్తూ ఉందంటే......, పాత్రలు వ్యక్తులు గా మారి గుర్తొస్తున్నారంటే........:) ఆ... కథే కథ!
చదువుతూ ఉంటే గుండె పట్టేసి, కళ్ళు చెమ్మగిల్లాయంటే....., పూర్తయ్యాక ప్రపంచం శూన్యంగా, బుర్ర మొద్దుబారి పోయిందంటే... అద్గదీ కథ.
జ్ఞాపకాల తేనెపట్టుని తట్టి లేపుతుందా... ...చిచ్చుపెడుతుందా... ఊ.....కథే ....... :)
వింత లోకాలని చూపి విస్మయ పరుస్తుందా! ఊహల ఉయ్యాలలో ఊగిస్తుందా ఐతే పొట్టనిండే కథే!
అసలింతకు చెప్పొచ్చేదేంటంటే కథలపుస్తకాలు నాకిష్టం. చక్కటి శిల్పం, కథనం, కమ్మటిభాష, శైలీ ఉన్నాయంటే ఆకథ ఎవరిదైనా నాకు ఓకేనే :)

ఒక యోగి ఆత్మకథ

5:20 PM వద్ద 5:20 PM

నేను యోగ లో డిప్లమో చేస్తున్న సమయంలో ఆ కోర్స్ కి సంబంధం లేక పోయినా యోగ, యోగి అన్న పేరున్న ప్రతి పుస్తకమూ కొనేదాన్ని. అలా నాకు పరిచయమైనదే 'Autobiography of a yogi.'
కొంతకాలం నా దగ్గరున్న ఆ పుస్తకం పుస్తక ప్రియులెవరో దోచిన కారణంగా ఈ మధ్య మళ్ళీ కొన్నాను. ఈ సారి తెలుగు వెర్షన్‌ 'ఒక యోగి ఆత్మ కథ.'

శ్రీ పరమహంస యోగానంద రాసిన వారి ఆత్మ కథే ' ఒక యోగి ఆత్మ కథ.'యోగి జీవితం, యోగ విద్యలు వీటిగురించి స్వయంగా ఒక యోగి రాసిన గ్రంధం ఇది. పుస్తకంలోని ముందు మాటలో ఎంతో మంది ప్రశంసలు అందజేసారు. అందులో ఒకటి ఇలా ఉంది.... "ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని, ఎన్నడూ విని ఉండనంత విశిష్టమైన ఒక వ్యక్తిత్వన్ని సాటిలేని శక్తి తోనూ స్పష్టతతోనూ ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది; పాఠకుడు ఆద్యంతం ఉత్కంఠతతో నిండిపోతాడు.... కేవలం మానసికమైన ఆధ్యాత్మికమైన మానవ కృషి మాత్రమే శాశ్వతమైన విలువ ఉన్నదనీ, మానవుడు తన ఆంతరంగిక శక్తి తో భౌతికమైన అవరోధాలనన్నింటినీ జయించ గలడనీ ఈ పుటల్లో తిరుగు లేని ఋజువు లభిస్తుంది.... ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకువచ్చే శక్తి ఈ ప్రముఖమైన జీవిత చరిత్రకుందని మనం ఎంచాలి."

మొదటి సారి నేను ఈ పుస్తకం చదివి నప్పుడు ఆ నాల్గు రోజులూ కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతి. చదువుతున్నంత సేపూ సంభ్రం, ఆశ్చర్యం నన్ను ముంచెత్తుతూనే ఉంది.
రెండవ సారి నింపాదిగా, కులాసాగా చదువుకున్నాను. మళ్ళీ అబ్బురపడ్డాను, ఆశ్చర్య పోయాను!
సరళమైన శైలీ, అద్భుతమైన సంఘటనల చిత్రణ. ఆద్యంతమూ వదల కుండా చదివించేస్తుందీ పుస్తకం.

సనాతన భారతీయ ధ్యాన ప్రక్రియ అయిన క్రియా యోగాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయటమే పరమ హంస యోగా నందుల జీవిత కర్తవ్యం అని ఆయన గురువు గారి జోస్యం. ఆ దిశగానే ఆయన జీవితం సాగుతుంది.
ఆయన కి తారసపడిన యోగుల ఫొటోలు మధ్య పేజీల్లో పొందుపర్చారు.

బాల్యం తో మొదలెట్టి కుటుంబము, విద్యాభ్యాసము, తన గురువుతో గడిపిన రోజులు..తనకి తారసపడిన యోగులు, ఎదురైన సంఘటనలు, ఆయన కలుసుకున్న మహాత్ములు ఇతర యోగుల గురించి, వారి అద్భుత శక్తుల గురించి ఆసక్తి కరమైన ఎన్నో సంగతులు వివరిస్తూ అన్నింటివెంటా మనల్ని పరుగులు పెట్టించేస్తారు. . ఆయన నిర్మల భక్తి, దృఢ విశ్వాసము చదువరులను ముగ్ధులను చేస్తాయి.
ఎన్ని సార్లు చదివినా విసుగు పుట్టించనిది, ఏ పేజీయైనా నేరుగా తెరచి చదువుకోగలది 'ఒక యోగి ఆత్మ కథ.'



...........................................................................

అనగనగా ఒకరోజు

11:52 AM వద్ద 11:52 AM

అన్నిరోజులు ఒక్కలా ఉండవు. డైరీ ని అడిగితే చెపుతుంది!
ఓ రోజంతా ఏం చేశామో ఆలోచనలెలా సాగాయో గమనిస్తే, కూర్చుని వాటిని అలాగే రాస్తే మనకే తెలియకుండా ఎన్నో సంగతులు కనిపిస్తాయి! ప్రయత్నించి చూడండి ..... అన్నట్టు ఇక్కడ కథ లో అమ్మాయి ఓ పూట సంగతులు పంచుతోంది ఒక్క మారు అక్కడికి వెళ్ళొచ్చి పని మొదలెట్టండి.

శిల్పి

5:34 PM వద్ద 5:34 PM

నేను చూసిన హ్యారీపాటర్ సినిమాల గురించి .....> తెలుగురత్న లో.

నేను రాసిన కథ 'శిల్పి' ---> ప్రాణహిత వెబ్ పత్రిక లో

ఈ మధ్య బ్లాగు తెరవటమే కుదరలేదు, ఇంకో మూడునెలలదాకా ఇంతే బిజీ...!
ఇంకో రెండు రోజులైతే సంవత్సరం మారిపోతుంది ఈ యేడాది రాసినవి బ్లాగులో ఇప్పుడే ఎట్టెస్తే ఓ పనైపోతుంది :)

బ్లాగు మిత్రులందరికీ Happy & Prosperous New Year 2009












అసమర్ధులు

7:51 PM వద్ద 7:51 PM

నేను రాసిన కథ
ఈ మాట నవంబర్ సంచిక లో -->ఇక్కడ చదవండి

ఓ మొగుడి వ్యధ

12:45 AM వద్ద 12:45 AM

జిడ్డు మొహం, మడ్డిమెదడుది దీని బుర్రలో అసలు మెదడుందా! ఎంత తిట్టినా మిడిగుడ్లేసుకుని అట్లా చూస్తూంటది, దీని కసలు ఫీలింగ్స్ ఉండవా!
“ఓయ్ కాఫీ ఇక్కడపెట్టిపోతే..! నాకేవన్నా మంత్రవిధ్యలు వచ్చనుకున్నావా? చెప్పడానికి నీ నాలిక అరిగిపోతుందనా! చూడు నా కాలు తగిలి పడిపోయింది, వచ్చి తుడిచి తగలడు.”
ఆ చూపుకర్ధం ఏమిటో! టీ పాయ్ మీద కాళ్ళెందుకు పెట్టావనేమో! అసలు టీపాయ్ ఉన్నదే కాళ్ళు పెట్టుకోటానికి, దీనికేంతెలుసు గనక ఇది తెలియడానికి!
చీ! తడిబట్టేసి అచ్చం పనిమనిషి లాగే తుడిచేస్తుంది. కాస్త నాజూకుగా తుడవచ్చుగా! మోటు మనిషి.. నా ఖర్మ కొద్దీ దొరికింది.
సినిమాల్లో ఎంత అందంగా చేస్తారు! పనులన్నీ చేసినా జుత్తు చదరకుండా, చీర నలగకుండా, తలనిండా పూలతో నవనవలాడుతూ...!
ఇది పనులు చేస్తుంటే చూసే వాళ్ళు పనిమనిషే అనుకుంటారు తప్పించి ఇంటి ఇల్లాలంటే నమ్ముతారా!

ఆ మోహన్‌ గాడి పెళ్ళాం ఎప్పుడు చూసినా ఇస్త్రీ చీర నలగ కుండా కనిపిస్తుంది, వాడి అదృష్టం ఏం చేస్తాం!
ఆ మధూ..! వాడి పెళ్ళామైతే నెల తిరిగేసరికల్లా పదివేలు సంపాదించి వాడి చేతిలో పోస్తుంది. ఇదో దరిద్రగొట్టుది, దీనిపై ఖర్చే గాని దమ్మిడీ రాబడి లేదు.
హు… ఇప్పుడెన్ననుకుని ఏం లాభం! ఎక్కువ చదివిన వాళ్ళు మాట వినరనే గదా, చిన్న పిల్లైతే బుద్దిగా, ఒద్దికగా కాపరం చేసుకుంటుందని వెతికి, వెతికి దీన్ని చేసుకుంది. పెళ్ళి నాటికి డెబ్బై శాతం మార్కులతో ఇంటర్ పూర్తిచేసింది, మీకు ఇష్టమైతే చదివించండీ అన్నారు, చదివిస్తే ఉద్యోగం చేసేదే! కాని తనదేమో మరీ బీకాం తర్డు క్లాసు చదువు, చూస్తూ చూస్తూ దీన్ని బియ్యెస్సీ ఎలా చదివించగలం! ఐనా పెళ్ళాం సంపాదన తినే అదృష్టం అందరికీ ఉండొద్దూ!

దీని ముక్కేంటీ ఈ పక్కనుండి చూస్తుంటే నడ్డి ముక్కులాగుంది! పెళ్ళి చూపులనాడు అంత గమనించనేలేదు!
ఆ బల్బు వెలుతుర్లో కూర్చోబెట్టి చూపించారు, పచ్చటి పసిమి చాయ లాంటి రంగు అని మోసపోయా! ఆ.. ఏం రంగులే ఇదంతా మధ్యలోనే తిండివల్ల వచ్చిన రంగే, లేకపోతే ఇద్దరు పిల్లలూ అంత నల్లగా ఎందుకు పుడతారు! నేను నలుపే ఒప్పుకుంటా, నా పిల్లలైనా తెల్లగా ఉండాలనే గా దీనిరంగుచూసి చేసుకుంది.
ఇద్దర్ని కని గేదె లా తయారైయ్యింది! నాకు బయట సవాలక్షపనులు.. బలం కోసం నేను తినడం ఎలాగూ తప్పదు, పొట్ట ఇలా పెరగాల్సిందే, ఏం చేయలేం. ఐనా మగ వాడికి పొట్ట ఉంటేనే ఇంట్లో లక్ష్మి తాండవిస్తుందంటారు. ఆడది దీనికేం రోగం! కాస్త తిండి తగ్గించి సన్నబడచ్చుగా.

ప్చ్.. మొన్నటికి మొన్న.. రమణ మామ కొడుకు పెళ్ళికి దీన్నేసుకు వెళితే ఎంత అవమానంగా అనిపించిందనీ! ఆ శేఖర్ గాడిదీ తమది ఓ రెండ్రోజుల తేడాతో ఒకేసారి కదూ పెళ్ళైంది. వాడు, వాడి పెళ్ళాం కొత్తగా పెళ్ళైన జంటలా వచ్చారు అక్కడికి. వాడి పెళ్ళాం ఆ కారులోంచి దిగడమే ఎంత స్టైల్ గా దిగిందని! జుట్టు విరబోసుకుని ఎంత అందంగా తయారై వచ్చింది!
ఇదీ ఉంది కోతిలా నా వెనుక స్కూటర్ పై కూర్చుని గాలికి చిందరవందరైన జుట్టుతో, జడేసుకుని పల్లెటూరి గబ్బిలం లాగ!
ఆ పెళ్ళి లో మెరుపు తీగల్లా తిరుగుతూవున్న వాళ్ళని చూస్తూంటే ఈ బండది ఎంత రోత గా అనిపించిందో. ఖర్మ కాలి దీన్ని చేసుకున్నా.

చూస్తుంటే ఇది రోజు రోజు కీ పొట్టిగా ఐపోతున్నట్లు నాకు డౌట్! పెళ్ళి చూపులనాడు బానే కనిపించింది ఆ హైమని చేసుకోవాల్సిందా! ప్చ్ నేనే తిప్పి తిప్పి కొడితే ఐదున్నరకి రెండంగులాలు తక్కువే ఉన్నా, హైమ నాకంటే పొడవనే కదా ఆ సంబంధం వదులుకుంది. మామయ్య కూతుర్నైనా చేసుకోసుకునుండాల్సింది. అది నల్లగా ఉందని వద్దన్నా...., మొన్నటి పెళ్ళి కి తన భర్త తో కలిసి వచ్చింది, ఎంతబావుందని!
ఐనా దీని బాబు ఇచ్చే కట్నం మామయ్య ఇస్తానన్న దానికన్నా ఓ యాభై వేలు ఎక్కువని, అనవసరంగా తొందరపడి దీన్ని చేసేసుకున్నా! ఆ డబ్బ కాస్తా చెల్లి పెళ్ళికి చేసిన బాకీలకీ, వేరే పాత అప్పులు తీర్చడానికీ అప్పుడే ఖర్చైపోయింది.

పెద్దక్క మొదట చెప్పిన సంబంధం బాగుండే, బాగా డబ్బున్న వాళ్ళు, పైగా చిన్న పిల్ల.. ! ఆ… ఏం చిన్నపిల్లలే చిన్న పిల్ల మాటలా అది మాట్లాడింది!! జుట్టంతా గీకేసిన మరిగుజ్జు గొరిల్లా లాగా ఉన్నాడు నేను చేసుకోను అంది అందరిముందూ!! తనకేం తక్కువ? కాస్త మూతి ఎత్తుగా ఉన్నందుకే గొరిల్లా లా కనిపించానా దానికి!! తననొద్దనన్నందుకు దానికి తగిన శాస్తి జరిగింది, అందరికీ ఒంకలు పెడుతూ పెళ్ళీ పెటాకులు లేక ఇంకేం చేయాలో తోచక చదివీ, చదివీ ఇప్పుడేదో ఉద్యోగం చేస్తుందట. పెద్ద హోదా అని చెప్పుకు మురుస్తున్నారు గాని అదే నన్ను చేసుకునుంటే ఇప్పటికి ఇద్దరు పిల్లల్ని కని గౌరవంగా ఇంటిపట్టున హాయిగా ఉండేది. బైటకెళ్ళి అడ్డమైన చాకిరీ చేసే బాధ తప్పేది.
ఇప్పుడు చూడు ఆ అదృష్టం దీనికి పట్టింది.

అబ్బ ఎంత పొగరు! దీనికి? గుడ్డ తెచ్చి మొహాన కొట్టి పోయింది. జలుబు చేస్తే చీమిడి రాదేమిటీ? ఏదో లేవలేక ఇక్కడే చీది పడేసా, తరువాత ఎలాగూ తుడుస్తుంది కదా అని! దీనికే ఇదొక్కతే ప్రపంచంలో పరిశుభ్ర్తత పాటించే దానిలా!
నేను పెట్టే తిండి ఎక్కువై కొవ్వెక్కింది దీనికి.
ఆడపడుచు కట్నం దగ్గర పేచీ పడి ఒదులుకున్నాడు గాని ఆ సిక్రింద్రాబాద్ వాళ్ళ అమ్మాయి ఉమ ఐతే సిటీ పిల్ల అన్నివిధాలా బాగుండేది. ఈ పల్లెటూరి ముచ్చుమొహం దానికి ఓకల్చరూ లేదు పాడు లేదు. ఏదో ఆస్థివుంది ఒక్కతే పిల్ల అని ఆశపడి ఈ శని గ్రహాన్ని తెచ్చుకున్నా. పోనీ ఏమైనా పెట్టుపోతలు పెడుతున్నారా అంటే అదీ లేదు చెప్పుకుంటే సిగ్గు చేటు. ఆ పెళ్ళి నాడు ఇచ్చిందే!
ఏదడిగినా ఆ పొలం మాతరువాత మీకే కదండీ అంటారు దొంగ పీనుగులు వీళ్ళు ఎప్పుడు చావాలీ? ఏడాది కి ముష్టి మూడు జతల బట్టలు పెట్టి ఏదో పీతాంబాలు ఇచ్చినట్టు పోజులు! మహా ఐతే సంవత్సరానికి ఓ రెండు బస్తాల బియ్యం, ఇంటికి కావలసిన సరుకులూ అవీ పంపిస్తున్నారు, దానికే తెగ నీలిగి పోతున్నారు. అసలు ముందుముందు నాకు రావల్సిన పొలం లోని పండే పంటే కదా అదంతా, నా పంట నాకు పంపటం కూడా గొప్పేనా!

ఇంకేం మిగిలింది దీనికి! పెళ్ళిచూపులకి ముందు అక్క దీన్ని చూసొచ్చి అమ్మాయిది తాచుపాము లాంటి జడరా అని తెగ చెప్పింది. ఏం తాచుపాము! ఇప్పుడది వానపామైపోయింది. తనంటే ఆఫీసుకెళతాడు, ఎండలో బైట తిరుగుతాడు కనక తనకు బట్టతలైంది. అదీగాక మగవాడికి బట్టతల సిరిని తెస్తుంది అంటారు. ఆడదాని అందం దాని జట్టులోనే కదా ఉండేది. ఆ మాత్రం మెయింటేయిన్‌ చేసి చావద్దూ వెదవ పీనుగ!
హా.. హైనా ఇప్పుడెన్ని అనుకుని ఏం లాభం! నా తలరాత ఇలా ఏడిచింది.
ఏదో నాది విశాల హృదయం కనక ఇంకా దీన్ని ఏలుకుంటున్నా! ఈ జన్మ కి దీంతో అడ్జెస్ట్ అవ్వాల్సిందే తప్పదు.



**************

'ముందున్న జీవితం'

6:01 PM వద్ద 6:01 PM

'మీ జీవితం వైపే బాగా కళ్ళు విప్పి చూడండి ఎంత స్తబ్దంగా, ఎంత మూర్ఖంగా, ఎంత సంకుచితంగా ఉందో...' అంటాడు. ఎందుకలా జరిగింది? ఎలా బయట పడగలం?

ప్రపంచానికి పరిచితమైన గొప్ప తత్వవేత్త జె.కృష్ణమూర్తి.
సర్వ సమగ్ర మైన జీవితం ఎలా సాధించవచ్చో తన అద్భుత ఆలోచనలను ప్రసంగాలు గా అందించారు ఈ పుస్తకం లో. చివరివరకూ ఆసక్తి తో చదివేస్తాం.
నేను మొదటిసారి చదివి చాలా సంవత్సరాలు దాటింది.

మానవ జీవితం సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ రంగులద్దుకుంటూ సంక్షోభం లోకి జారుతోంది,
నిరాశ, నిసృహ, దుఖం, ఆందోళన, భయం, అసూయ, ద్వేషం, హింస, పేదరికం, పోటీ, యుద్దం లేని ప్రపంచం కోసం ముఖ్యంగా విద్యావిధానం లోనే మార్పు జరగాలనే ఆశయం తో తన విద్యార్థు లను ఉద్దేశించి చేసిన ప్రసంగాలే ఈ ముందున్న జీవితం (లైఫ్ అహెడ్ కి అనువాదం).
సరళమైన శైలి తో సాగే ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపూ మనల్ని మనం పరిశీలించుకుంటూనే ఉంటాం.
గతం లో ఎన్నో సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నవీ, సమాధానాలు చెప్పుకున్నవీ నాకు దీన్ని చదువుతున్నంతసేపూ తారసపడుతూnనే ఉన్నాయి.
ఆ మాటకొస్తే జీవితం ఏమిటి? ఎందుకు? నిజంగా మనం చేస్తున్నదేమిటి? ఎందుకు? అని ప్రశ్నించుకునే ప్రతిఒక్కరూ దీన్ని చదువుతున్నంతసేపూ అవునివే నా మనసులోని వ్యథలు సరిగ్గా ఇతను చెప్పేదే నేనూ కోరుకుంటున్నది. అనుకోకుండా ఉండలేరు.

పుస్తకం విద్యార్ధులను ఉద్దేశించిన ప్రసంగాలు, వారి ప్రశ్నలకు ఆయన సమాధానాలతో సాగుతుంది.

విద్య జీవనోపాధి కొరకేనా?
విద్య ఎందుకు అభ్యసించాలని అనుకుంటున్నారు, జరిగిన చరిత్రలూ, వేరొకరి రచనలూ వీటి పై పట్టు సాధించటం మాత్రమే విద్య కాదు మీరు స్వయంగా నేర్చుకున్న వివేకం, ప్రజ్ఞ మాత్రమే నిజమైన విద్య
అది భయభీతి, సాంప్రదాయ మూసధోరణులు ఉన్నంతవరకు కుదరనిది, స్వేచ్చ లేకుండా వివేకం వికసించదు.
విద్య అనేది ఉద్యోగం, సంపాదన, పెళ్ళి, పిల్లలు, చిరాకులూ, వీటికోసమే నేర్చుకునేది కాక ఇష్టమైన పనిని ప్రీతితో చేయడానికి తగినa సునిశిత తెలివితేటలు పొందడానికి ఉద్దేశించినaదై ఉండాలి కాని నాడు ఆ విద్య జీవితాన్ని మరింత దుర్భర వేదనలో ఇరికిస్తుంది అన్వేషించి తప్ప అనుకరించి విద్య నేర్వకూడదు అంటాడు.
కర్తవ్యం అనేమాట మిమ్మల్ని హతమారుస్తోంది, బలిపశువుని చేస్తోంది అంటాడు ఒక చోట.
ఇలా దైవం, సమాజం, ప్రేమ, ఆకాంక్షపరత్వం, శాంతి, విధేయత, స్వతంత్రత, సత్యం, ఆదర్శం, వీటన్నింటికీ లోకం మనకి ఇచ్చే నిర్వచనాలకి భిన్నంగా నిర్వచిస్తాడు, వాటిని గురించిన ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు.

నేను చెప్పానని ఇలాగే వీటిని ఆచరించకండి, మీ వివేకాన్ని మేలుకొల్పటం కొరకు నేను చెప్పినవాటిని ఉపయోగించుకొండి అంటాడు చివరగా.

ఊరికే అలా చదివే పుస్తకం కాదు. చదువుతున్నప్పుడూ ఆ తరువాత మనలో ఒకదాంట్లోంచి ఒకటిగా ఆలోచనా కిటికీలు తెరచుకుంటూనే ఉంటాయి.




నీ ఆశ నీదే

8:14 PM వద్ద 8:14 PM

నేను రాసిన కథ , " నీ ఆశ నీదే"
ప్రాణహిత ఆగస్ట్ ఎడిషన్ లో మీ అమూల్య అభిప్రాయాలు కోరుతూ:)
http://www.pranahita.org/2008/08/ni_asha_neede/